హరీష్ రావు - జూ.ఎన్టీఆర్... మధ్యలో చిన్న 'పొలిటికల్' లైన్!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పార్టీలో, కేబినెట్లో తన తనయుడు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. సోమవారం నాడు శాఖల్లో మార్పులు చేర్పులు చేశారు. ఇందులో కెటిఆర్‌కు కీలక శాఖలు అప్పగించారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కెసిఆర్.. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దారిలో నడుస్తున్నారా అనే చర్చ సాగుతోంది. గతంలో చంద్రబాబు తన తనయుడు నారా లోకేష్ కోసం హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను పక్కన పెట్టినట్లుగా వాదనలు ఉన్న విషయం తెలిసిందే.
ఇప్పుడు, తనయుడు కెటి రామారావు కోసం కెసిఆర్ అల్లుడు హరీష్ రావు రాజకీయ ప్రాధాన్యత తగ్గిస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. ఇందులో నిజానిజాలు పక్కన పెడితే.. హరీష్ రావు తనకు మైనింగ్ శాఖ వద్దని చెప్పడం, దానిని కెటిఆర్‌కు అప్పగించడం, కీలక శాఖలు తనయుడికి అప్పగించిన నేపథ్యంలో.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా చర్చకు వస్తోంది.

అయితే, హరీష్ రావు, జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కొన్ని తేడాలు కూడా ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. నారా లోకేష్ కోసం జూ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందే చెక్ పెట్టారని, అదే సమయంలో హరీష్ రావు రాజకీయంగా తనను తాను ప్రూవ్ చేసుకున్నందున.. రాజకీయంగా ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నాలు జరుగుతుండవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబు తర్వాత టిడిపి వారసత్వాన్ని జూ ఎన్టీఆర్ తీసుకోవాలని నాడు చాలామంది భావించారు. ఆయన తండ్రి హరికృష్ణ కూడా అదే భావించారు. దీంతో, నారా లోకేష్ కోసం చంద్రబాబు జూ ఎన్టీఆర్‌కు రాజకీయాల్లోకి రాకముందే చెక్ పెట్టారు.
హరీష్ రావు మాత్రం కెటిఆర్ కంటే ముందే రాజకీయాల్లో ఉన్నారు. రాజకీయాల్లో తానేమిటో నిరూపించుకున్నారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కీలకమైన మైనింగ్ శాఖ ఆయన వద్దని చెప్పడం, దానిని కెటిఆర్‌కు అప్పగించడం గమనార్హం.
అత్యధిక శాఖలు కెసిఆర్, తర్వాత కెటిఆర్ వద్దే ఉన్నాయి. కెటిఆర్ వద్ద మున్సిపల్, ఐటీ, పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్, గనులు, ఎన్నారై వ్యవహారాల శాఖలు ఉన్నాయి. హరీష్ రావు వద్ద నీటి పారుదల, మార్కెటింగ్, శాసన వ్యవహారాలు ఉన్నాయి.
తనకు పని భారం పెరుగుతుందని, మైనింగ్ శాఖ నుంచి తప్పించాలని హరీష్ రావు ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కోరినట్లుగా జరగడంపై కూడా చర్చ జరుగుతోంది. ఆయన నిజంగానే అలా విజ్ఞప్తి చేశారా లేక రాజకీయంగా కెటిఆర్ కోసం ప్రాధాన్యత తగ్గిస్తున్నారా అనే చర్చ సాగుతోంది. కెటిఆర్, ఇతర మంత్రులకు కానప్పుడు హరీష్ రావుకు మాత్రమే పని భారం కావడం ఏమిటని కూడా అంటున్నారు.












Click it and Unblock the Notifications