హైదరాబాద్ నుంచి జనసేన ఔట్!: పవన్ కళ్యాణ్ కోసం టిడిపి ప్రయత్నం
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి కొద్ది రోజుల క్రితమే తెలంగాణ ఈసీ నుంచి గుర్తింపు వచ్చింది. ఈ నేపథ్యంలో రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్ఎంసి) ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందా? పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారా? అనే చర్చ అప్పుడే సాగుతోంది.
అయితే, జనసేన పోటీ విషయాన్ని పక్కన పెడితే, తెలుగుదేశం పార్టీ నేతలు అప్పుడే పవన్ కళ్యాణ్ కోసం విషయమై చర్చిస్తున్నారని సమాచారం. జిహెచ్ఎంసి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చేత జోరుగా ప్రచారం చేయిస్తే బాగుంటుందని భావిస్తున్నారు.
జిహెచ్ఎంసి ఎన్నికల్లో జనసేన పోటీ చేసే అవకాశాలు కనిపించడం లేదు. గత గురువారం ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... తనకు ఇప్పుడే ఎన్నికల్లో పోటీ చేసే ఆర్థిక బలం లేదని, 2019 పోటీ చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లోను జనసేన పోటీ చేయదని భావిస్తున్నారు. టిడిపి - బిజెపి కూటమికి మద్దతు పలికే అవకాశాలున్నాయి. జనసేన మద్దతుతో పాటు పవన్ కళ్యాణ్‌తో ప్రచారం చేయిస్తే ప్రజలు, ముఖ్యంగా యువత తమ వైపు మొగ్గు చూపుతుందని టిడిపి నేతలు భావిస్తున్నారని అంటున్నారు.
2014 సార్వత్రిక ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే బిజెపి - టిడిపికి జిహెచ్ఎంసిలో మంచి పట్టు ఉంది. జిహెచ్ఎంసి పరిధిలోని 24 సీట్లలో ఈ కూటమి 14 సీట్లను గెలుచుకుంది. ఆ తర్వాత పలువురు ఎమ్మెల్యేలు టిఆర్ఎస్‌లో చేరారు.
ఈ నేపథ్యంలో తమ బలానికి తోడు పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిడిపి - బిజెపి కూటమి మేయర్ పదవి దక్కించుకోవడం ఖాయమని టిడిపి వర్గాలతో పాటు బిజెపి వర్గాలు భావిస్తున్నాయని అంటున్నారు.
ఈ నెల 21న వరంగల్ ఉప ఎన్నికలు ఉన్నాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడం లేదు. అయితే, తెలంగాణ టిడిపి అధ్యక్షులు ఎల్ రమణ మాట్లాడుతూ... తమకు పవన్ కళ్యాణ్ మద్దతు ఉందని, ఆ మద్దతుతో గెలుస్తామని చెప్పడం గమనార్హం.












Click it and Unblock the Notifications