కవిత కొత్త పార్టీ పెడితే సక్సెస్ అవుతుందా? పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే!
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ, కెసిఆర్ తనయ కవిత వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది. కవిత లేఖతో ఒక్కసారిగా బిఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు మొదలు కాగా, తాజాగా కెసిఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నారని కవిత చేసిన వ్యాఖ్యలు, అంతర్గతలేఖ బహిర్గతం ఎట్లా అయిందని కవిత సంధించిన ప్రశ్నలు, ఆ తర్వాత అంతర్గత వ్యవహారాలు అంతర్గతంగానే మాట్లాడాలని పరోక్షంగా కేటీఆర్ ఇచ్చిన సమాధానం వెరసి అన్నాచెల్లెళ్ల మధ్య పంచాయితీ రచ్చగా మారింది.
కొత్తపార్టీ పెట్టే ఆలోచనలో కవిత
కెసిఆర్ తోనే అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైన కవిత పార్టీలో ప్రాధాన్యం కోసం, తన భవిష్యత్తు నిర్ణయం కోసం సంచలన అడుగువేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. పార్టీ అధినేత కేసిఆర్ కు అల్టిమేటం ఇచ్చి, అవసరం అనుకుంటే కొత్తపార్టీ పెట్టే ఆలోచనలో కూడా కవిత ఉన్నట్టు సమాచారం. ప్రధానంగా పార్టీ విషయంలో తన డిమాండ్లను కేసీఆర్ అంగీకరించకపోతే, కవిత కొత్త పార్టీ పెడతారు అని ప్రస్తుతం రాజకీయవర్గాలలో చర్చ జరుగుతుంది.

కవిత కొత్తపార్టీ పెడితే సక్సెస్ అవుతుందా?
తెలంగాణ జాగృతి సంస్థ పేరుని పార్టీ పేరుగా మార్చాలని ఒక ఆలోచనతో పాటు, తెలంగాణ బహుజన రాష్ట్రసమితి అనే పేరుపైన కూడా ప్రధానంగా చర్చ. అయితే ఇదే సమయంలో కవిత కొత్తపార్టీ పెడితే సక్సెస్ అవుతుందా? ఆమె బలం ఎంత? ప్రజాక్షేత్రంలో ఆమెకున్న చరిష్మా ఎంత? అన్న చర్చ కూడా జరుగుతుంది. కెసిఆర్ కూతురుగా, రాజకీయాలలో ఆమెకు స్థానం ఉన్నప్పటికీ, ఢిల్లీ లిక్కర్ కుంభకోణం తర్వాత కవిత గ్రాఫ్ పడిపోయింది.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత జైలు జీవితం
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో జైలుకు వెళ్లిన క్రమంలో ఆ దెబ్బ బీఆర్ఎస్ పార్టీ పైన కూడా పడింది. ఇక ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో జైలు జీవితం అనుభవించి వచ్చిన కవిత ఇంకా ఆ కేసు నుంచి పూర్తిగా బయటపడలేదు. ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్న కవిత ఆ కేసులో ట్రయల్ ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కవితకు అంత పెద్ద ఫాలోయింగ్ ఉన్న పరిస్థితి లేదు.
కవిత కొత్త పార్టీ పెడితే కష్టమే
జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కవిత ప్రజాక్షేత్రంలోకి దూకుడుగా వెళ్లలేకపోయారు. ఈ సమయంలో కవిత కొత్త పార్టీ పెట్టినా, ఆమె వెంట వచ్చేది ఎవరు? ఆమెతో నడిచే ముఖ్య నాయకులు ఎవరు? అన్నది ప్రశ్నార్ధకమే. ఒకవేళ కవిత కొత్త పార్టీ పెడితే అది బి ఆర్ ఎస్ పార్టీలో చీలిక తీసుకువస్తుంది కానీ కవితకు ఏమాత్రం మేలు చేయదు.
కవిత నిర్ణయం తప్పవుతుందా?
రాజకీయంగా కవిత పార్టీ ప్రజాదరణకు నోచుకోదు అన్నది ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి కొందరు రాజకీయ విశ్లేషకుల వాదన. ఏది ఏమైనా మొన్నటిదాకా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో జైలు జీవితం అనుభవించి వచ్చిన కవిత ఈ సమయంలో కొత్త పార్టీ పెట్టడం కచ్చితంగా రాంగ్ స్టెప్ అవుతుందని కొందరు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications