Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అలర్ట్: రేపటి వరకు అటు వైపు వెళ్లే వారు జాగ్రత్త, ట్రాఫిక్ డైవర్షన్

భారత విమానయాన రంగం ఒక కీలక మలుపు దిశగా ప్రయాణిస్తున్నదన్న సంకేతాలను వింగ్స్ ఇండియా 2026 (Wings India 2026) స్పష్టంగా ఇచ్చింది. హైదరాబాద్‌లోని బేగంపేట్ విమానాశ్రయంలో నిర్వహించిన ఈ అంతర్జాతీయ ఎయిర్ షో (Air Show), భారత్‌ను కేవలం విమానాల వినియోగ మార్కెట్‌గా కాకుండా, తయారీ, నిర్వహణ, సేవల రంగాల్లో ప్రపంచ కేంద్రంగా మార్చే ప్రయత్నాలకు వేదికగా నిలిచింది. ఈ ప్రదర్శనలో కుదిరిన ఒప్పందాలు, భాగస్వామ్యాలు భారత విమానయాన విధానంలో దీర్ఘకాలిక మార్పులను సూచిస్తున్నాయి.

వింగ్స్ ఇండియా 2026లో అత్యంత ప్రాధాన్యత పొందిన పరిణామం ఎయిర్ ఇండియా విస్తరణ ప్రణాళిక. 30 ఇంధన సమర్థవంతమైన బోయింగ్ నారోబాడీ విమానాలను అదనంగా ఆర్డర్ చేయడంతో, సంస్థ మొత్తం కొనుగోలు జాబితా 600 విమానాలకు చేరింది. ఇది కేవలం సంఖ్యాపరమైన పెరుగుదల కాదు.. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో సామర్థ్య విస్తరణతో పాటు, ఇంధన వ్యయం తగ్గింపు, ఆపరేషనల్ సామర్థ్యం పెంపునకు సంబంధించిన వ్యూహాత్మక నిర్ణయంగా ఇది విశ్లేషకులు భావిస్తున్నారు.

Wings India 2026 Marks a Turning Point as India Emerges from Aviation Market to Global Manufacturing Hub

విమానాల కొనుగోలుకే పరిమితం కాకుండా, ఎయిర్ ఇండియా బోయింగ్ గ్లోబల్ సర్వీసెస్‌తో బహుళ-సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకోవడం కీలక పరిణామం. ఈ ఒప్పందం ద్వారా సంస్థకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాలన్నిటికీ ప్రత్యేక నిర్వహణ మద్దతు లభించనుంది. భారత విమానయాన రంగంలో తరచూ ఎదురయ్యే నిర్వహణ సమస్యలకు ఇది ఒక నిర్మాణాత్మక పరిష్కారంగా మారే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Wings India 2026: 'మేక్ ఇన్ ఇండియా'కి గట్టి బలం

వింగ్స్ ఇండియా 2026 'మేక్ ఇన్ ఇండియా' లక్ష్యాలకు కొత్త ఊపునిచ్చింది. శక్తి గ్రూప్-ఓమ్నిపాల్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ద్వారా, L410 NG 19 సీట్ల విమానాన్ని దేశీయంగా అసెంబుల్ చేసే అవకాశాలు తెరపైకి వచ్చాయి. భారతదేశంలోనే ఫైనల్ అసెంబ్లీ లైన్ ఏర్పాటు సాధ్యమైతే, ఇది ప్రాంతీయ విమానయానానికి, చిన్న మార్గాల కనెక్టివిటీకి కీలకంగా మారనుంది. అదే సమయంలో, విమాన తయారీ విలువ గొలుసులో భారత్ స్థానం మరింత బలపడుతుంది.

స్వదేశీ హెలికాప్టర్ రంగానికి కీలక మలుపు

హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) మరియు పవన్ హన్స్ లిమిటెడ్ మధ్య కుదిరిన ₹1,800 కోట్ల ఒప్పందం భారత పౌర హెలికాప్టర్ రంగంలో కీలక ఘట్టంగా నిలిచింది. 10 ధృవ్ నెక్స్ట్ జనరేషన్ హెలికాప్టర్ల సరఫరా ద్వారా, దేశీయ అవసరాలకు స్వదేశీ ప్లాట్‌ఫామ్‌లను వినియోగించే దిశగా అడుగు పడింది. ఇది దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడమే కాకుండా, దేశీయ డిజైన్, తయారీ సామర్థ్యాలపై నమ్మకాన్ని ప్రతిబింబిస్తోంది.

విమానాలు, మౌలిక వసతులతో పాటు, నైపుణ్యవంతమైన మానవ వనరుల అవసరం కూడా విమానయాన రంగంలో కీలకం. ఈ నేపథ్యంలో, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) మరియు ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) కలిసి ప్రారంభించిన అక్రిడిటేషన్ ప్రోగ్రామ్ ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే ఐదేళ్లలో 115 మందికి పైగా భారతీయ విమానయాన నిపుణులకు అంతర్జాతీయ ప్రమాణాల శిక్షణ ఇవ్వడం ద్వారా, భారత విమానాశ్రయాల నిర్వహణ ప్రపంచ స్థాయికి చేరే అవకాశం ఉంది.

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చేసిన వ్యాఖ్యలు, ప్రభుత్వ విధాన దిశను స్పష్టం చేశాయి. "భారత్ ఇక విమానాలు ఎగరేసే దేశమే కాదు, వాటిని డిజైన్ చేసి, నిర్మించే దేశం" అన్న వ్యాఖ్యలు, దీర్ఘకాలిక దృక్పథాన్ని ప్రతిబింబిస్తున్నాయి. అదే సమయంలో, తెలంగాణ ప్రభుత్వం 2047 నాటికి రాష్ట్రాన్ని ఏరో-ఇంజిన్,MRO హబ్‌గా మార్చాలన్న లక్ష్యం, కేంద్ర-రాష్ట్ర సమన్వయానికి ఉదాహరణగా నిలుస్తోంది.

ట్రాఫిక్ డైవర్షన్

వింగ్స్ ఇండియా 2026కు నేటి నుంచి ప్రజలకు నేరుగా వీక్షణ అనుమతి ఇవ్వడం, ఈ కార్యక్రమాన్ని పరిశ్రమ పరిమితుల నుంచి ప్రజల మధ్యకు తీసుకువచ్చింది. అయితే, అదే సమయంలో బేగంపేట్ పరిసరాల్లో ట్రాఫిక్ సవాళ్లు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే వాహనదారులకు పోలీసులు ట్రాఫిక్ సూచన చేశారు. ఉదయం 7 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పంజాగుట్ట-గ్రీన్‌ల్యాండ్స్-బేగంపేట ఎయిర్‌పోర్ట్ మార్గంలో భారీ ట్రాఫిక్ ఉండే అవకాశం ఉందని, PNT ఫ్లైఓవర్, రసూల్‌పురా, సీటీవో జంక్షన్ల వద్ద రద్దీని తగ్గించడానికి తగిన మళ్లింపులు ఉంటాయని పేర్కొన్నారు. ఎయిర్ షోకు హాజరయ్యే వారి కోసం నిర్దేశిత పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు.వాహనదారులు పీక్ అవర్స్‌లో ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+