ఎవరికీ భయపడను, ఉన్నత స్థానంలో ఉన్నా గౌరవం దక్కడం లేదు: తమిళిసై సౌందరరాజన్
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఇప్పటికీ సరైన గౌరవం దక్కడం లేదన్నారు. రాజ్భవన్లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో.. మహిళా సాధికారతను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడారు.

నన్ను భయపెట్టలేరు, ఉన్నత స్థానంలో ఉన్నా గౌరవం ఏది: తమిళిసై
మహిళలకు ఇప్పటికీ సరైన గౌరవం దక్కలేదన్న గవర్నర్ తమిళిసై.. చివరికి అత్యున్నత పదవిలో ఉన్న వారు సైతం సరైన గౌరవం పొందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తననెవరూ భయపెట్టలేరని.. తాను దేనికి భయపడనని స్పష్టం చేశారు. ఏ స్త్రీ తన స్వార్థం కోసం ఏదీ కోరుకోదని.. ప్రతిదీ తన కుటుంబం కోసమే కోరుకుంటుందని గవర్నర్ తెలిపారు. స్త్రీలందరూ ఆర్థిక స్వావలంబన కలిగి ఉండాలని గవర్నర్ తమిళిసై అన్నారు. భవిష్యత్తు కోసం పొదుపు పాటించాలని చెప్పారు.

ఆనందాన్ని వదులుకోవదన్న గవర్నర్ తమిళిసై
నిరాశ, నిస్పృహలో కూరుకుపోకుండా ప్రతి అడుగూ నూతనోత్సహంతో ముందుకు సాగాలని మహిళలకు గవర్నర్ తమిళిసై పిలుపునిచ్చారు. మహిళలకు పలు సూచనలు చేస్తూ.. ముఖ్యంగా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. ఆనందాన్ని వదులుకోవద్దన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు మహిళలకు, తెలంగాణ స్త్రీలకు తేడా ఏంటని.. ఇటీవల తనను ఓ ఇంటర్వ్యూలో అడిగారని తమిళిసై తెలిపారు. అందరూ ఒకేలా ఉంటారని సమాధానం చెప్పినట్లు తెలిపారు. తెలంగాణ సోదరిగా తాను ఇక్కడి మహిళల జీవన విధానాన్ని ఎంతగానో ఇష్టపడతానని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వెల్లడించారు.

ఏదైనా సాధించాలన్న తపన ఉండాలంటూ తమిళిసై సౌందరరాజన్
మహిళలు ప్రతి నిమిషాన్ని ఆస్వాదించాలని.. ఆనందాన్ని దేని కోసం కూడా వదులుకోకూడదని సూచించారు గవర్నర్. ఒక్కోసారి అవకాశం చేజారినా బాధపడాల్సిన అవసరం లేదని.. ఏదైనా సాధించాలనే తపన ఎప్పుడూ ఉండాలని గవర్నర్ స్పష్టం చేశారు. సమాజంలో మహిళలు ఇప్పటికీ వివక్షకు గురవుతూనే ఉన్నారు. అత్యున్నత పదవిలో ఉన్న మహిళలూ అందుకు మినహాయింపు కాదు. భారతీయ మహిళ ఎవరికీ భయపడదు. ప్రతి మహిళా ఆర్థిక స్వావలంబన కలిగి ఉండాలి. ఏ స్త్రీ అయినా తన స్వార్థాన్ని పక్కనపెట్టి తన కుటుంబం గురించే ఆలిచిస్తుంది. మహిళలు ప్రతి నిమిషాన్ని ఆస్వాదించాలి. ఏదైనా సాధించాలనే తపనతో ఉండాలని తమిళిసై సౌందర రాజన్, గవర్నర్ పిలుపునిచ్చారు. కాగా, సంప్రదాయంగా వస్తున్న అసెంబ్లీలో గవర్నర్ ప్రారంభ ప్రసంగాన్ని.. తెలంగాణ ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. దీంతో తమిళిసై నేడు జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరుకాలేదు. ఈ విషయంలో కేసీఆర్ సర్కారు తీరుపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications