ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌కి కరోనా పాజిటివ్...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కరోనా బారినపడ్డారు. కరోనా అనుమానిత లక్షణాలతో ఎమ్మెల్యే టెస్టులు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. రెండు రోజులుగా నియోజకవర్గంలో హరితహారం కార్యక్రమంలో ఆమె పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో తనతో పాటు హరితహారం,ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నవారు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని హరిప్రియ నాయక్ కోరారు.
గతంలో రాష్ట్రంలో పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. శుక్రవారం(జులై 2) కేవలం 858 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో 9 మంది కరోనాతో చనిపోయారు. మరో 1,175 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,25,237కు చేరుకుంది. ప్రస్తుతం 12,726 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ 3,678 మంది కరోనాతో మృతి చెందారు.

శుక్రవారం నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 107,ఖమ్మంలో 81 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా నిర్మల్‌లో 2,జోగులాంబ గద్వాల జిల్లాలో 5 కేసులు నమోదయ్యాయి.
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో రాష్ట్రంలో మరోసారి లాక్‌డౌన్ విధించగా జూన్ 20 నుంచి అన్ని రకాల ఆంక్షలను ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని రకాల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.కోవిడ్ ఉద్ధృతి తగ్గడం,పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గడంతో ప్రభుత్వం లాక్‌డౌన్ ఎత్తివేసింది. లాక్‌డౌన్ ఎత్తివేసినప్పటికీ ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో ముఖానికి మాస్కులు,భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని చెబుతోంది.
ఇక రాష్ట్రంలో జులై 1 నుంచి విద్యా సంస్థలను పున:ప్రారంభించాలని నిర్ణయించినప్పటికీ... థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఆన్‌లైన్ క్లాసులకే పరిమితం కావాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications