ఫొటోలు తీశాడు: ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడు
హైదరాబాద్: తనను ప్రేమించకపోతే చంపేస్తానని ఓ అమ్మాయిని బెదిరిస్తున్న యువకుడిని హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. తొమ్మిదో తరగతి చదువుతున్న అమ్మాయని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇందిరానగర్‌లో ఉంటున్న వల్లాల శేఖర్ (19) తండ్రితో కలిసి స్థానికంగా స్క్రాప్ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇదే బస్తీకి చెందిన 14 ఏళ్ల విద్యార్థిని జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతోంది.

ఆమెను శేఖర్ గత కొంత కాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. బాలిక తల్లిదండ్రులిద్దరు కూడా ఉద్యోగులే. వారికన్నా ముందే బాలిక పాఠశాల నుంచి ఇంటికి చేరుకుంటుంది. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండడాన్ని గమనించిన శేఖర్ ఓ రోజు బలవంతంగా ఇంట్లోకి చొరబడి ఆమె ఫొటోలు తీశాడు.
ప్రేమించకపోతే ఆ ఫొటోలను ఫేస్‌బుక్కులో పెడుతానని బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. అతడి వేధింపులను తట్టుకోలేక కొద్ది రోజులుగా కుమిలిపోతున్న బాలిక చివరకు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో వారు శుక్రవారం కూతురితో పాటు బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు శేఖర్‌ను అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications