చంద్రబాబు బాటలో షర్మిల, తప్పలేదు - క్షమించండి..!!
వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల సంచలన ప్రకటన చేసారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నట్లు వెల్లడించారు. ఈ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు కీలక ప్రకటన చేసారుర. పాలేరు లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీలో ఉన్నారని..ఆయనను ఓడించటం ఇష్టం లేక తాను కూడా పోటీ చేయటం లేదని చెప్పుకొచ్చారు. తెలంగాణ భవిష్యత్ కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలు తనను క్షమించాలని షర్మిల కోరారు.
ఎన్నికలకు దూరంగా షర్మిల : వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ పోటీ చేయటం లేదని ప్రకటించారు. తాను తొలి నుంచి రాజన్న రాజ్యం కోసం పార్టీ ఏర్పాటుతో సహా.. బీఆర్ఎస్ ను ఓడించాలనే లక్ష్యంతో పని చేసానని స్పష్టం చేసారు. కానీ, మారుతున్న పరిణామాలతో తాను కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ..అన్ని వర్గాలకు మేలు జరుగుతుందనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. కాంగ్రెస్ కు వైఎస్సార్టీపీ బేషరతుగా మద్దతు ఇస్తున్నామని వెల్లడించారు. వైఎస్సార్టీపీ శ్రేణులు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం పని చేయాలని షర్మిల పిలుపుఇచ్చారు. అదే సమయంలో తాను పాలేరు నుంచి పోటీ చేయటం లేదని చెప్పారు.

కాంగ్రెస్ కు షర్మిల మద్దతు : ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు షర్మిల వెల్లడించారు. పాలేరు లో కాంగ్రెస్ నుంచి పొంగులేటి పోటీలో ఉన్నారని చెప్పుకొచ్చారు. పొంగులేటి 2014 ఎన్నికల్లో గెలుపు కోసం తాను ప్రచారం చేసానని చెప్పారు. తెలంగాణలొ తన పాదయాత్ర సమయంలో పొంగులేటి మద్దతుగా నిలిచారని గుర్తు చేసారు. అటువంటి పొంగులేటిని ఓడించేలా తాను నడుచుకోవాలా అని ప్రశ్నించారు. వైఎస్సార్ కు గాంధీ కుటుంబం మీద అపార గౌరవం ఉందన్నారు. రాహుల్ ప్రధాని కావాలని వైఎస్సార్ కోరుకున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్ పైన గాంధీ కుటుంబం ఎలాంటి అభిమానం తో ఉండేవారో..తనతోనూ అదే రకమైన అభిమానంతో వ్యవహరించారని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ నుంచి హామీతో : తాను తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలతో పాటుగా పార్టీ శ్రేణులు అర్దం చేసుకోవాలని షర్మిల కోరారు. ఇక, కాంగ్రెస్ నేతలతో కలిసి షర్మిల ఎన్నికల ప్రచారంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీ తెలంగాణ ఎన్నికల బరి నుంచి తప్పుకోవటం కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశంగా ప్రచారంలో ఉంది. ఇప్పుడు తాను ఖచ్చితంగా పోటీ చేస్తానంటూ తొలి నుంచి చెబుతూ వచ్చిన షర్మిల..ఇప్పుడు కాంగ్రెస్ కు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ఫలితాల తరువాత షర్మిలకు పార్టీలో కీలక బాధ్యతల పైన కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో, ఇప్పుడు షర్మిల రాజకీయ నిర్ణయం ఎటువంటి సమీకరణాలకు కారణం అవుతుందనేది చూడాలి.












Click it and Unblock the Notifications