ఢిల్లీకి వైఎస్ షర్మిల - ఆ భేటీ వెనుక :సైలెంట్ పొలిటికల్ ఆపరేషన్..!!
వైఎస్ షర్మిల ఢిల్లీ వెళ్తున్నారు. ఈ పర్యటన వెనుక ఆసక్తి కర రాజకీయం తెర మీదకు వస్తోంది. తెలంగాణ వేదికగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ ప్రకటన వేళ.. వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల కీలక అడుగులు వేస్తున్నారు. షర్మిల తన సోదరుడు.. ఏపీ సీఎం జగన్ తో విభేదించి తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం పాలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్దం అవుతున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ పార్టీ ప్రారంభించి న షర్మిల పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే 2500 కిలో మీటర్ల పాదయాత్ర పూర్తి చేసారు.

షర్మిల ఢిల్లీ పర్యటన వెనుక
కొద్ది రోజులు షర్మిల రాజకీయ ప్రణాళికల్లో మార్పు కనిపిస్తోంది. టీఆర్ఎస్ - కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేస్తున్నారు. తీవ్ర స్థాయిలో ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. ఇదే సమయంలో కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించారు. అటు మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల అయింది. షర్మిల నాయకత్వంలో వైఎస్సార్టీపీ మునుగోడు బై పోల్ కు దూరంగా ఉంది. ఈ సమయంలోనే వైఎస్ షర్మిల ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నారు. పార్టీ ఏర్పాటు తరువాత షర్మిల ఈ సమయంలో ఢిల్లీ వెళ్లటం రాజకీయంగా అనేక చర్చలకు కారణమవుతోంది. షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీలో కీలక నేతల చేరికలు లేవు. షర్మిల వాయిస్ ఒక్కటే పార్టీలో వినిపిస్తోంది. ఈ క్రమంలో తన తండ్రి పథకాలు - నేటి ప్రభుత్వ తీరును టార్గెట్ చేస్తూ షర్మిల ప్రజల్లోకి వెళ్తున్నారు.

కేంద్రంలోని ప్రముఖులతో భేటీ
అదే సమయంలో పదే పదే కేసీఆర్ పాలనలో అవినీతి గురించి ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీ పర్యటన కోసం షర్మిల ఈ రోజు - రేపు తన పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. తిరిగి 8వ తేదీన కామారెడ్డి జిల్లా నుంచి తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. కేసీఆర్ పాలనలో అవినీతి పైన ఢిల్లీ పెద్దలతో పాటుగా కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేసేందుకే షర్మిల ఢిల్లీ వెళ్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, అమిత్ షా తో షర్మిల భేటీ కానున్నారని సమాచారం. ప్రస్తుతం కాశ్మీర్ పర్యటనలో ఉన్న అమిత్ షా తో శుక్రవారం షర్మిల భేటీ అవుతారని తెలుస్తోంది. దీని పైన పార్టీ నుంచి అధికారికంగా ఈ భేటీల పైన సమాచారం బయటకు రాలేదు. కానీ, ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు షర్మిల కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్యులతో భేటీ కానున్నారు.

షర్మిల రాజకీయం మారుతోందా
ఇదే సమయంలో.. షర్మిలకు ఢిల్లీ రావాలంటూ ఆహ్వానం అందటంతోనే.. ఇప్పుడు ఢిల్లీకి వెళ్తున్నారనే సమాచారం అందుతోంది. వైఎస్సార్టీపి నేతలు షర్మిల ఢిల్లీ వెళ్తున్నారనే అంశం మినహా..ఇతర విషయాలు వెల్లడించానికి ముందుకు రావటం లేదు. కేసీఆర్ ప్రభుత్వం పైన ఇప్పటికే బీజేపీ చేసిన ఆరోపణలనే ఇప్పుడు షర్మిల కొనసాగిస్తున్నారు. అయితే, దీనికి సంబంధించిన సమాచారంతోనే షర్మిల ఢిల్లీ వెళ్లి కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేయనున్నారని చెబుతున్నారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా కేంద్ర సంస్థలు నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని, దీంతో షర్మిల పర్యటన రాజకీయంగా తెలంగాణలో కొత్త సమీకరణాలకు కారణం కానుందని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ కుటుంబ ఆస్తులతో పాటు, కాలేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై సీబీఐ విచారణ జరపాలని షర్మిల కోరనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications