బీజేపీ విమోచన దినమట, టీఆర్ఎస్ సమైక్యత దినమట; ఒక్క మంచిపనైనా చేశారా?: వైఎస్ షర్మిల
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్నారు. నూట నలభై ఐదు రోజులుగా ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై విరుచుకుపడుతూ ముందుకు సాగుతున్న వైయస్ షర్మిల తాజాగా నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను కేసీఆర్ పక్కన పెట్టింది అందుకే
నాగర్ కర్నూలు జిల్లాలో ప్రజాప్రస్థానం పాదయాత్రకు తరలివచ్చిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన వైఎస్ షర్మిల. వైయస్ఆర్ నాగర్ కర్నూలు జిల్లాకు చేసిన మేలును నేటికీ మర్చిపోకుండా, వైయస్ఆర్ బిడ్డను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో తెలంగాణ సర్కారు తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాళేశ్వరంలో వచ్చే కమీషన్ల కోసమే సీఎం కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి పనులను పక్కన పెట్టారని వైయస్ షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్ ఫామ్ హౌస్ కు తప్ప ఎక్కడ 24 గంటల ఉచిత విద్యుత్ అందడం లేదని వైయస్ షర్మిల విమర్శించారు.

అభివృద్ధిలో పోటీ పడాల్సిన పార్టీలు, దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నాయి
రాష్ట్రాన్ని కెసిఆర్ అప్పుల ఊబిలోకి నెట్టారు అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగానికి ఏం ఒరగబెట్టారని, కెసిఆర్ దేశమంతా తిరుగుతున్నారో చెప్పాలని వైయస్ షర్మిల ప్రశ్నించారు. రైతులకు పంట నష్టపరిహారం, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్న సీఎం కేసీఆర్ తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే సమయంలో రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయాలపై వైయస్ షర్మిల తనదైన శైలిలో సెటైర్లు వేశారు. కేంద్రంలోని అధికార బీజేపీని, రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ ను టార్గెట్ చేసిన షర్మిల అభివృద్ధిలో పోటీ పడాల్సిన పార్టీలు.. దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.
ఒకరిది విమోచనా రాజకీయం మరొకరిది సమైక్యతా రాజకీయం..
సెప్టెంబర్ 17న బీజేపీ పార్టీ విమోచన దినమట, టీఆర్ఎస్ పార్టీ సమైక్యత దినమట. అధికారంలో ఉండి ప్రజలకు పనికొచ్చే ఒక్క మంచి పనైనా చేశారా? అంటూ వైఎస్ షర్మిల బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాల తీరును నిలదీశారు. ఇక ఇదే సమయంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే పైన కూడా వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేకు రెండు సార్లు అధికారమిస్తే.. ప్రజలను గాలికొదిలి నల్లమట్టి వ్యాపారంలోనే మునుగుతున్నాడని వైయస్ షర్మిల ఆరోపించారు.

నాగర్ కర్నూలు ఎమ్మెల్యేకు కర్రు కాల్చి వాత పెట్టండి
ఇసుక దందాలు, భూకబ్జాలతో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే బిజీ అయ్యాడని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యేకు ప్రజలంతా కర్రుకాల్చి వాతపెట్టాలని వైయస్ షర్మిల పిలుపునిచ్చారు. అంతేకాదు ఎన్నికల సమయంలో కేసీఆర్, బంగారు నాగర్ కర్నూలు చేస్తానని చెప్పి, బతుకే లేకుండా చేశాడని వైయస్ షర్మిల నిప్పులు చెరిగారు. నాగర్ కర్నూల్ లో ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీలు లేవని మండిపడ్డారు. మెడికల్ కాలేజీకి దళితుల భూములు అప్పనంగా గుంజుకుని, దళితుల్ని రోడ్డున పడేశారని వైయస్ షర్మిల తేల్చిచెప్పారు.












Click it and Unblock the Notifications