YS Sharmila: బాప్ ఏక్ నంబర్..బేటా దస్ నంబర్: ఏకిపారేసిన వైఎస్సార్టీపీ అధినేత్రి
హైదరాబాద్: పూర్తిస్థాయి రాజకీయాల్లో ఇటీవలే అడుగు పెట్టిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల.. అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని టార్గెట్‌గా చేసుకుని తనదైన శైలిలో విమర్శలను సంధిస్తోన్నారు. ఘాటు వ్యాఖ్యలతో చెలరేగిపోతోన్నారు. ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలంటూ డిమాండ్ చేయడాన్ని తన రాజకీయ అజెండాగా మార్చుకున్న వైఎస్ షర్మిల.. తన విమర్శల పదును పెంచారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌లను టార్గెట్‌గా చేసుకున్నారు. బంగారు తెలంగాణ నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణం ఎవరంటూ ప్రశ్నిస్తోన్నారు.
కేటీఆర్ పర్యవేక్షిస్తోన్న మున్సిపల్ శాఖలో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ.. వాటిని భర్తీ చేయడానికి ప్రభుత్వం ఎందుకు ముందుకు రావట్లేదని నిలదీస్తోెన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలనే సోయి కూడా ముఖ్యమత్రి కేసీఆర్‌కు ఉండట్లేదని మండిపడ్డారు. ఇప్పటికే స్థానిక సంస్థల్లో ఉద్యోగాల ఖాళీలతో పరిపాలన పడకేసిందని ఆరోపించారు. సకాలంలో ఖాళీలను భర్తీ చేయకపోవడం వల్ల ఉన్న అరకొర సిబ్బందిపై అదనపు భారం పడుతోందని వైఎస్ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలు ఇన్‌ఛార్జీల పరిధుల్లో నామమాత్రంగా పనిచేస్తోన్నాయని ధ్వజమెత్తారు.

ఇన్‌ఛార్జీల మీద స్థానిక పరిపాలన నెట్టుకొస్తోందని, ఇది మంచిది కాదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఇలాకాలోనే పర్మనెంట్ ఉద్యోగులు లేకపోవడం.. మున్సిపల్ శాఖ అధ్వాన్నపు పనితీరుకు అద్దం పడుతోందని మండిపడ్డారు. తన సొంత నియోజకవర్గంలోనైనా మున్సిపాలిటీల్లో ఖాళీలను భర్తీ చేసి, స్థానిక పరిపాలనను గాడిన పెట్టాలనే ధ్యాస కేసీఆర్ లేదని విమర్శించారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం వల్ల స్థానిక పాలన అస్తవ్యస్తమైందని అన్నారు.
ఒకవైపు నిరుద్యోగులు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్స్ వెలువడక నిరుత్సాహానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, మరోవైపు చాలినంత మంది ఉద్యోగులు లేకపోవడం వల్ల మున్సిపాలిటీల వ్యవస్థ అధ్వాన్నంగా మారిందని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఉద్యోగాలను ఇస్తామని హామీలు ఇచ్చి, అవసరం తీరాక యువత, నిరుద్యోగులను అవతల పడవేయటంలో కేసీఆర్, కేటీఆర్ ఆరితేరాని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ విషయంలో బాప్ ఏక్ నంబర్.. బేట దస్ నంబర్‌గా మారిపోయారని మండిపడ్డారు. వార్డు ఆఫీసర్స్ పోస్టులు కూడా భర్తీ చేస్తామంటూ మున్సిపల్ ఎన్నికల సమయంలో శాసన మండలి సాక్షిగా చిన్న దొర కేటీఆర్ చేసిన ప్రకటనలు చేశారని వైఎస్ షర్మిల ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ తరువాత వాటి ఊసే లేదని విమర్శించారు.












Click it and Unblock the Notifications