బీజేపీలో చేరికలకు గేట్లు ఎత్తేసిన వేళ..రూటు మార్చిన వైఎస్ షర్మిల
హైదరాబాద్: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తన రూటు మార్చారు. రాష్ట్ర రాజకీయాల్లో మరింత దూకుడుగా వ్యవహరించనున్నారు. పాదయాత్రకే పరిమితం కాకుండా- రాజకీయాల్లో ఎప్పటికప్పుడు చోటు చేసుకుంటోన్న పరిణామాలపైనా దృష్టి పెట్టారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖలో చేరికలకు గేట్లు ఎత్తేసిన ప్రస్తుత పరిస్థితుల్లో.. పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేశారు. ఒకవంక తన పాదయాత్రను కొనసాగిస్తూనే- దానికి సమాంతరంగా కేసీఆర్ ప్రభుత్వంపై దాడిని తీవ్రతరం చేశారు.
తెలంగాణ ఆవిర్భవించిన తరువాత ఏర్పాటైన కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మితమైన భారీ నీటి ప్రాజెక్టుల్లో అవినీతి చోటు చేసుకుందంటూ కొద్దిరోజులుగా వైఎస్ షర్మిల ఆరోపిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ఆమె ఇదివరకే జల వనరుల మంత్రిత్వ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్‌ను కలిశారు. ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి చోటు చేసుకుందని ఆరోపిస్తూ ఈఎన్‌సీ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించారు. తన నిరసనను తెలియజేశారు.

ప్రాజెక్టుల నిర్మాణంలో భారీ ఎత్తున ఆర్థికపరమైన అవకతవకలు జరిగాయని, వందల కోట్ల రూపాయల మేర ముడుపులు చేతులు మారాయని ఆమె ఆరోపించారు. ఇదే విషయం మీద మరో అడుగు ముందుకేశారు వైఎస్ షర్మిల. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో సమావేశం కానున్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి చోటు చేసుకుందని, దీనిపై విచారించేలా ఆదేశాలను ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు.
ఈ సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలుసుకున్నారు. దీనికోసం అపాయింట్‌మెంట్ కోరారు. అపాయింట్‌మెంట్ లభించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గవర్నర్ అపాయింట్‌మెంట్ లభించిన నేపథ్యంలో ఇవ్వాళ్టి నుంచి పునఃప్రారంభం కావాల్సిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర రేపటికి వాయిదా పడింది. మంగళవారం తెల్లవారు జామునే ఆమె హైదరాబాద్ లోటస్ పాండ్ నివాసం నుంచి బయలుదేరి- పాదయాత్రను పునఃప్రారంభిస్తారు.
కాగా- నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయనున్న విషయం తెలిసిందే. ఇవ్వాళ ఆయన స్పీకర్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ ఇప్పటికే బీజేపీలో చేరారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ప్రదీప్ రావు టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. ఆయన కూడా బీజేపీలో చేరొచ్చనే ప్రచారం ఉంది.












Click it and Unblock the Notifications