సమ్మక్క సారలమ్మ ఆలయంలో షర్మిల: కేసీఆర్ కోసం: తులాభారం: మొక్కులు చెల్లింపు
ములుగు: ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసిల మహా పర్వదినంగా గుర్తింపు తెచ్చుకున్న మేడారం జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి రెండు సంవత్సరాలకోసారి మాఘపౌర్ణమికి ముందు ఈ జాతర ఆరంభమౌతుంది. నాలుగు రోజులు కొనసాగుతంది. సమక్క-సారలమ్మలను దర్శించడానికి దేశం నలుమూలల నుంచే కాకుండా.. విదేశాల నుంచి కూడా భక్తులు మేడారానికి వస్తుంటారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు సమక్క-సారలమ్మ జాతర జరుగనుంది.

ప్రత్యేక బస్సులు..
వనదేవతలను దర్శించుకోవడానికి వచ్చే భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రత్యేక బస్సులను నడిపించనుంది. హైదరాబాద్ నుంచే కాకుండా.. తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాల నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకుని రానున్న టీఎస్ఆర్టీసీ అధికారులు. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్, టీఎస్ఆర్టీసీ యాప్‌లో టికెట్లను బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ప్రత్యేక బస్సుల ఛార్జీని 398 రూపాయలుగా నిర్ధారించారు.

కోవిడ్ మార్గదర్శకాల మధ్య..
16వ తేదీ నుంచి ఈ బస్సులు అందుబాటులోకి వస్తాయి. జాతర కొనసాగినన్ని రోజులు రాకపోకలు ఉంటాయి. హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ సెంట్రల్ బస్‌స్టేషన్ నుంచి బస్సులు రాకపోకలు సాగిస్తాయి. కోవిడ్ మార్గదర్శకాలను ప్రతి ప్రయాణికుడు పాటించాల్సి ఉంటుందని టీఎస్ఆర్టీసీ అధికారులు సూచించారు. మాస్కులను ధరించడం, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం తప్పనిసరి చేశామని పేర్కొన్నారు.

మేడారం ఆలయాన్ని దర్శించిన వైఎస్ షర్మిల..
కాగా- వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఈ మధ్యాహ్నం వనదేవతలు మేడారం ఆలయాన్ని దర్శించారు. వనదేవతలు సమ్మక్క-సారలమ్మలకు ప్రత్యేక పూజలు చేశారు. తులాభారం ఇచ్చారు. మొక్కులు చెల్లించుకున్నారు. ఆమె వెంట ములుగు జిల్లా కోఆర్డినేటర్లు, పార్టీ నాయకులు ఉన్నారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని తన నివాసం నుంచి బయలుదేరిన ఆమె మధ్యాహ్నానికి మేడారానికి చేరుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ఆలయ పెద్దలు సాదరంగా ఆహ్వానం పలికారు.

కేసీఆర్ మనసు మార్చేలా..
అనంతరం సమ్మక్క-సారలమ్మ గద్దె వద్దకు చేరుకున్నారు. చీరెసారెలను సమర్పించారు. తులాభారాన్ని ఇచ్చారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వైఎస్ షర్మిల కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మనసు మార్చాలని వనదేవతలను మొక్కుకున్నానని చెప్పారు. గిరిజనులు, ఆదివాసీలు, అడవి బిడ్డల మీద ప్రేమ చూపేలా కేసీఆర్ మనసు మార్చాలని ప్రార్థించానని అన్నారు. నిరుద్యోగుల ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాల భర్తీ కోసం వెంటనే నోటిఫికేషన్ జారీ చేసేలా కేసీఆర్ మనసు మార్చాలని ఆ సమ్మక్క సారాలమ్మ తల్లులను వేడుకున్నట్లు షర్మిల పేర్కొన్నారు.
Recommended Video

ఆదివాసీలకు రైతుబంధు..
పొడు భూముల సమస్యలను పరిష్కరిస్తామంటూ కేసీఆర్ ఆదివాసీలను మభ్య పెడుతున్నారని విమర్శించారు. పోడు భూములను సాగు చేసుకుంటున్న సాగుదారులకు భూహక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. వారికి రైతుబంధు పథకాన్ని వర్తింపజేయాలని అన్నారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని, వాటిని ఆపేలా చూడాలని, కేసీఆర్ కళ్లు తెరిపించాలని కోరుకున్నట్లు వైఎస్ షర్మిల చెప్పారు.












Click it and Unblock the Notifications