శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్: తిరుమలలో..!!
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారికి వార్షిక సాలకట్ల తెప్పోత్సవాలను నిర్వహించడానికి టీటీడీ అధికారులు సన్నాహాలు చేస్తోన్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించారు.
తిరుపతి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 18 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచి ఉంటోన్నారు. సర్వదర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పడుతోంది. గురువారం 57,737 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 24,090 మంది స్వామివారికి తలనీలాలను సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి హుండీ ద్వారా 3.28 కోట్ల రూపాయలు ఆదాయం లభించింది.

పరీక్షల ప్రభావం..
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వివిధ రకాల పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్స్ వెలువడిన విషయం తెలిసిందే. విద్యార్థులు వాటికి సన్నద్ధమౌతోన్నారు. ఈ షెడ్యూల్స్ అన్నీ ముగిసిన తరువాత తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తోన్నారు. వేసవి సెలవుల్లో శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, దీనికి అనుగుణంగా ముందస్తు చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.

తెప్పోత్సవం..
కాగా- తిరుమలలో శ్రీవారికి సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్నాయి. దీనికి సంబంధించిన తేదీలను టీటీడీ అధికారులు వెల్లడించారు. మార్చి 3 నుంచి 7వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ అయిదు రోజుల పాటు రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో శ్రీవారు, పద్మావతి అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు.

తొలిరోజున..
ఈ అయిదు రోజుల సాలకట్ల తెప్పోత్సవాల్లో భాగంగా మార్చి 3వ తేదీన తొలి రోజు శ్రీసీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అవతారంలో తిరుమలేశుడు భక్తులకు దర్శనం ఇస్తారు. తెప్పలపై పుష్కరిణిలో దీపప్రభల మధ్య మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు. మార్చి 4వ తేదీన రెండవ రోజు రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణుడి అవతారంలో కనిపిస్తారు శ్రీవారు. పుష్కరిణిలో మూడుసార్లు విహరిస్తారు.

మూడోరోజు..
మార్చి 5వ తేదీన మూడో రోజు శ్రీభూసమేతంగా మలయప్ప స్వామివారు మూడుసార్లు పుష్కరిణిలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. అదేవిధంగా శ్రీమలయప్ప స్వామివారు మార్చి 6వ తేదీన నాలుగో రోజు నాడు అయిదుసార్లు, చివరి రోజైన మార్చి 7వ తేదీన ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారు.

ఆర్జిత సేవలు రద్దు :
తెప్పోత్సవాలను దృష్టిలో ఉంచుకుని మార్చి 3, 4వ తేదీల్లో తోమాలసేవ, అర్చన, సహస్ర దీపాలంకరణ సేవ, మార్చి 5, 6వ తేదీల్లో తోమాలసేవ, అర్చన, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, మార్చి 7వ తేదీన ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. సాలకట్ల తెప్పోత్సవాలను కనులారా వీక్షించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారని అంచనా వేస్తోన్నారు. దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications