శ్రీవారి లడ్డూ తయారీలో ఆ నెయ్యి వినియోగానికి టీటీడీ నో
తిరుపతి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు స్వామివారి దర్శనం కోసం పెద్దగా వేచి ఉండనక్కర్లేదు. కంపార్ట్‌మెంట్లల్లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా.. నేరుగా క్యూలైన్ల ద్వారా భక్తులు శ్రీవారిని దర్శించుకోవచ్చు. సర్వదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు దర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పడుతోంది.
ఆదివారం 85,258 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 25,451 మంది తలనీలాలను సమర్పించుకున్నారు. హుండీ ద్వారా 4.28 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. ఇక ఆగస్టులో స్వామివారి విశేష ఉత్సవాల సందర్భంగా భక్తుల తాకిడి మరింత పెరుగుతుందని టీటీడీ అధికారులు అంచనా వేస్తోన్నారు. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకుంటోన్నారు.

ఈ పరిణామాల మధ్య టీటీడీ అధికారులు ఓ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో నందిని నెయ్యిని వినియోగించకూడదని తీర్మానించారు. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) తయారు చేసే నెయ్యి ఇది. ఈ నెయ్యిని వాడకూడదని నిర్ణయించారు. ఈ మేరకు కేఎంఎఫ్‌తో ఉన్న కాంట్రాక్ట్‌ను ఇకపై రెన్యూవల్ చేయకూడదనే నిర్ణయానికి వచ్చారు.
దీనికి కారణాలు లేకపోలేదు. కేఎంఎఫ్ తన నెయ్యి ధరను భారీగా పెంచడమే. ఈ విషయాన్ని కేఎంఎఫ్ ఛైర్మన్ భీమా నాయక్ ధృవీకరించారు. టీటీడీ నిర్దేశించిన ధరకు తాము నెయ్యిని సరఫరా చేయలేమని అన్నారు. తక్కువ ధరకు నెయ్యిని సరఫరా చేసే టెండర్ల ప్రక్రియలో పాల్గొనట్లేదని వివరించారు.
నాణ్యమైన ఘీని తాము తయారు చేస్తోన్నామని, తక్కువ ధరతో సరఫర చేయడం వల్ల నాణ్యత కోల్పోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. తిరుమల సహా ఇతర ఆలయాల్లో లడ్డూ, ఇతర ప్రసాదాల తయారీ కోసం నందిని ఘీని సరఫరా చేయడానికి ఉద్దేశించిన టెండర్లను పునఃసమీక్షిస్తామని భీమా నాయక్ చెప్పారు. నాణ్యమైన ఘీ కావడం వల్ల తక్కువ ధరకు సరఫరా చేయలేమని తేల్చి చెప్పారు.

తాము సరఫరా చేస్తోన్న నందిని ఘీ రేటును ఆగస్టు 1వ తేదీ నుంచి పెంచబోతోన్నామని టీటీడీకి సమాచారం ఇచ్చామని భీమా నాయక్ అన్నారు. పాత ధరకే నెయ్యిని సరఫరా చేయాలని టీటీడీ కోరిందని, దీన్ని తాము నిరాకరించినట్లు ఆయన వివరించారు. ఆగస్టు 1వ తేదీ నుంచే నెయ్యి సరఫరా నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications