టీడీపీకి బిగ్ షాక్- మరో వికెట్ అవుట్..!!
తెలుగుదేశం పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు తాజాగా తిరుపతికి చెందిన పార్టీ కార్యదర్శి డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం రాజీనామా చేశారు.
తిరుపతి: ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఏలూరు జిల్లా కైకలూరుకు చెందిన మాజీ శాసన సభ్యుడు జయమంగళ వెంకటరమణ పార్టీకి రాజీనామా చేసి 24 గంటలు కూడా గడవక ముందే మరో సీనియర్ నాయకుడు షాక్ ఇచ్చారు. పార్టీకి గుడ్ బై చెప్పారు. ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు. ఏ పార్టీలో చేరాలనేది ఇంకొద్ది రోజుల్లో తేల్చేస్తానని, తన అనుచరులు, ముఖ్య నాయకులతో సమావేశమైన తరువాత దీనిపై నిర్ణయానికి వస్తానని వివరించారు.

తిరుపతి కార్యదర్శి..
ఆయనే- డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం. పార్టీ రాష్ట్రస్థాయి కార్యనిర్వాహక కార్యదర్శిగా పని చేస్తోన్నారు. ఆయన స్వస్థలం తిరుపతి జిల్లా. మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీతో ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2009 నాటి సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసి, ఓడిపోయారు. 24 వేలకు పైగా ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గెలిచారప్పట్లో.

టీడీపీలో జాయిన్..
ఆ తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో డాక్టర్ సుబ్రహ్మణ్యం.. తెలుగుదేశం పార్టీలో చేరారు. చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తరువాత బయటికొచ్చారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. క్రియాశీలకంగా వ్యవహరించారు. రాష్ట్రస్థాయి కార్యనిర్వాహక కార్యదర్శి స్థాయికి ఎదిగారు. జిల్లా రాజకీయాలపై ఆయనకు మంచి పట్టు ఉంది.

పార్టీలో కొనసాగలేను..
తాజాగా ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని చంద్రబాబుకు పంపించారు. 15 సంవత్సరాలుగా తాను పార్టీలో కొనసాగుతున్నప్పటికీ - ఎలాంటి గుర్తింపు దక్కట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నామమాత్రంగా ఆర్గనైజింగ్ కార్యదర్శి పదవిని నిర్వహిస్తోన్నానని అన్నారు. టీడీపీలో వెనుకబడిన సామాజిక వర్గాల నాయకులకు ఎలాంటి గౌరవం దక్కట్లేదని, సముచిత స్థానం లభించట్లేదని సిపాయి సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు.

ఏ పార్టీలో చేరాలనేది..
ఇప్పటికిప్పుడు తాను ఏ పార్టీలో చేరాలనేది నిర్ణయించుకోలేదని డాక్టర్ సుబ్రహ్మణ్యం చెప్పారు. భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలో చేరాలనే విషయంపై పార్టీ నాయకులు, కార్యకర్తలను చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటానని అన్నారు. తన తదుపరి చర్యలేమిటనేది త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు కొనసాగాలనేది తన అభిమతమని పేర్కొన్నారు. డాక్టర్ గా ప్రజలకు సేవలను అందించానని, దాని పరిధిని మరింత పెంచుకోవడానికి రాజకీయాల్లో కొనసాగుతానని అన్నారు.












Click it and Unblock the Notifications