తిరుపతి ఉప ఎన్నికలో జనసేనకు షాక్: ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ మరో పార్టీకి కేటాయింపు
తిరుపతి: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక సందర్భంగా తన మిత్రపక్షం భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించిన జనసేనకు ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాస్‌ను మరో పార్టీకి కేటాయించింది కేంద్ర ఎన్నికల కమిషన్. తిరుపతి ఉప ఎన్నిక బరిలో నిల్చున్న నవతరం పార్టీకి ఈ సింబల్ లభించింది. నవతరం పార్టీ అభ్యర్థి డాక్టర్ గోదా రమేష్ కుమార్.. ఇక గాజు గ్లాస్ గుర్తుతో ఉప ఎన్నికలో ప్రచారం చేసుకోనున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ తమకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించడం ఆనందాన్ని ఇస్తోందని నవతరం పార్టీ పేర్కొంది.
జనసేనకు కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో గుర్తింపు లేనందున.. ఎన్నికల గుర్తుగా వినియోగిస్తోన్న గాజు గ్లాస్‌ను తమకు కేటాయించినట్లు తెలిపింది. తమ అభ్యర్థి డాక్టర్ గోదా రమేష్ కుమార్‌కు అధికారికంగా గాజు గ్లాస్ గుర్తింపు లభించిందని నవతరం పార్టీ స్పష్టం చేసింది. గాజు గ్లాస్ గుర్తు మీద తాము ఇక ప్రచారం ముమ్మరం చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు రాపు సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. తిరుపతి ప్రజలను అన్ని పార్టీలు కూడా మోసగించాయని ఆయన విమర్శించారు. తిరుపతి సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంకన్న సాక్షిగా అబద్ధాలు చెప్పారని ధ్వజమెత్తారు.

బీజేపీకి గానీ, ఆ పార్టీ మిత్రపక్షం జనసేనకు గానీ తిరుపతిలో ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు. ప్రత్యేక హోదా సాధన విషయంలో కేంద్ర ప్రభుత్వ మెడలను వంచడంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని సుబ్రహ్మణ్యం ఆరోపించారు. తిరుపతి ఉప ఎన్నికను వైసీపీ గెలిస్తే.. ఆ పార్టీ ఖాతాలో మరో ఎంపీ సంఖ్య చేరుతుందే తప్ప.. ఉపయోగం ఉండదని అన్నారు. 2014 నుంచి 2019 వరకు అధికారంలో కొనసాగిన తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదాను కాలరాసిందని, దాని స్థానంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్యాకేజీకి అంగీకరించారని గుర్తు చేశారు.