ప్రభాస్‌ది హాలీవుడ్ రేంజ్- టీటీడీ ఛైర్మన్
తిరుపతి: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న సినిమా- ఆదిపురుష్. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన మైథలాజికల్ మూవీ ఇది. శ్రీరాముడిగా ప్రభాస్, సీతమ్మగా కృతి సనన్ నటించారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్- రావణుడి పాత్రను పోషించారు. లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త నగే నటించారు. రాధేశ్యామ్ తరువాత ప్రభాస్ నటించిన సినిమా ఇదే.
ఈ పాన్ ఇండియా మూవీ ఈ నెల 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో అభిమానులను పలకరించబోతోంది. 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో చిత్రీకరణ జరుపుకొన్న ఈ సినిమాను టీ- సిరీస్ నిర్మించింది. ఓం రౌత్ దర్శకుడు. రామాయణం ఆధారంగా తెరకెక్కడం వల్ల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఆధ్యాత్మిక నగరి తిరుపతిని ఎంచుకుంది యూనిట్.

ఈ సాయంత్రం ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది. తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్టేడియంలో లక్షలాది మంది అభిమానుల సమక్షంలో ప్రభాస్- విల్లునెక్కుపెట్టారు. ఆదిపురుష్ యాక్షన్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్- యూట్యూబ్‌లో విడుదలైన కొద్దిసేపటికే రికార్డు స్థాయి వ్యూస్‌ను సాధించింది. 16వ తేదీన సినిమా విడుదల కాబోతోందని దర్శకుడు ఓం రౌత్ ప్రకటించారు.
ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. త్రిదండి చినజీయర్ స్వామివారితో కలిసి ఆయన వేదికపైకి వచ్చారు. అనంతరం మాట్లాడారు. ప్రభాస్, కృతి సనన్, ఇతర నటీనటులను అభినందించారు. బాహుబలి తరహాలోనే ఆదిపురుష్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

భారత దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేసేలా, సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పేలా ఆదిపురుష్ సినిమాను తెరకెక్కించారని వైవీ సుబ్బారెడ్డి ప్రశంసించారు. టైటానిక్, అవతార్ స్థాయిలో ఈ సినిమా చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా హాలీవుడ్‌ను తలపించిందని, ఇప్పుడు ఆదిపురుష్ అదే స్థాయిలో ఘన విజయం సాధించాలని శ్రీవేంకటేశ్వరస్వామివారిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

రామాయణం మహాభారతం.. దేశ గొప్పదనాన్ని చాటి చెప్పే అతి గొప్ప ఇతిహాసాలని, అలాంటి ఉత్కృష్ఠ గ్రంధాల ఆధారంగా సినిమాను తీయాలనుకోవడం హర్షణీయమని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రామాయణ, మహాభారతాలకు ఇప్పటి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి- సినిమాగా తెరకెక్కించడాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు. తరతరాలకు నిలిచిపోయేలా, యువతకు రామాయణం గొప్పదనాన్ని తెలియజేసేలా ఆదిపురుష్ సినిమాను తీశారని ప్రశంసించారు.












Click it and Unblock the Notifications