శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక: తిరుమలలో ఆర్జితసేవలు, వీఐపీ దర్శనాల్లో మార్పులు
తిరుపతి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు రావడం వల్ల భక్తులు శ్రీవారి దర్శనానికి తిరుమలకు పోటెత్తుతున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 29 కంపార్టుమెంట్ల నిండిపోయాయి. క్యూ కాంప్లెక్స్ వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉంటోన్నారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పడుతోంది.
శుక్రవారం 81,833 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 33,860 మంది భక్తులు తలనీలాలలు సమర్పించారు. హుండీ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.3.31 కోట్ల రూపాయల ఆదాయం అందింది. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లలో వేచి ఉంటోన్న వారికి అల్పాహారం, పాలు, మంచినీరును టీటీడీ సిబ్బంది ఎప్పటికప్పుడు అందిస్తోన్నారు.

కాగా- కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగిపోవడం, వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ అనూహ్యంగా పెరుగుతోంది. సర్వదర్శనం భక్తులు శ్రీవారి దర్శనానికి సుమారు 30 నుంచి 40 గంటలపాటు వేచి ఉండాల్సి వస్తోంది. శుక్ర, శని, ఆదివారాల్లో భక్తుల సంఖ్య మరింత అధికంగా ఉంటోంది. కంపార్ట్‌మెంట్లల్లో వేచి ఉండాల్సిన సమయం ఎక్కువగా ఉంటోంది.
దీన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తోన్నారు. వారి సౌకర్యం కోసం జూన్ 30వ తేదీ వరకు స్వామివారి ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాల్లో స్వల్ప మార్పులు చేస్తున్నట్టు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
శుక్ర, శని, ఆదివారాల్లో సుప్రభాత సేవకు విచక్షణ కోటాను రద్దు చేశారు. విచక్షణ కోటా కింద సుప్రభాత సేవల్లో ప్రముఖులు పాల్గొంటుంటారు. సాధారణంగా 20 నిమిషాల పాటు కొనసాగుతుంటుంది ఇది. దీన్ని రద్దుచేయడం వల్ల ఆ 20 నిమిషాల సమయం ఆదా అవుతుంది. అలాగే- గురువారం నాడు నిర్వహించే తిరుప్పావడ సేవ ఇకపై ఏకాంతంగా నిర్వహిస్తారు.
దీనివల్ల మరో 30 నిమిషాల సమయం ఆదా అవుతుందని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ దర్శనాలకు సంబంధించిన ఎలాంటి సిఫారసు లేఖలను కూడా స్వీకరించబోమని ఆయన తేల్చి చెప్పారు. స్వయంగా స్వామివారి దర్శనానికి వచ్చే వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పిస్తామని స్పష్టం చేశారు. దీనివల్ల కూడా ప్రతిరోజు మూడు గంటల సమయం ఆదా అవుతుంది.
తాము తీసుకున్న ఈ తాజా చర్యలు, నిర్ణయాల వల్ల రద్దీ రోజులు, సెలవులు, వారాంతపు రోజుల్లో క్యూ లైన్లలో గంటల తరబడి, కిలోమీటర్ల మేర వేచి ఉండే వేలాది మంది సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనమౌతుందని వైవీ సుబ్బారెడ్డి వివరించారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని భక్తులు, వీఐపీలు అధికారులకు సహకరించాలని వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications