తిరుమలలో గరుడ పంచమి- ఈ ఉత్సవాల విశిష్ఠత ఇదే..!!
తిరుపతి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 13 కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉంటోన్నారు. సర్వ దర్శనం టోకెన్లు ఉన్న భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి 12 నుంచి 14 గంటల సమయం పడుతోంది. విశేష ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున తిరుమల కొండకు చేరుకుంటోన్నారు.
శనివారం 79,242 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 36,039 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. హుండీ ద్వారా 4.76 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. ఈ నెల చివరి వరకూ ఇదే తాకడి ఉండొచ్చని టీటీడీ అధికారులు అంచనా వేస్తోన్నారు. దీనికి అనుగుణంగా విస్తృత చర్యలు తీసుకున్నారు.

కాగా- ఆగస్టు 21వ తేదీ అంటే సోమవారం నాడు గరుడ పంచమి ఉత్సవాలను నిర్వహించనున్నారు టీటీడీ అధికారులు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని భక్తుల తాకిడి మరింత పెరుగుతుందని భావిస్తోన్నారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. గరుడ పంచమి పర్వదినం సందర్భంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనం ఇస్తారు.
తన ఇష్ట వాహనం గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతారు. భక్తులను అనుగ్రహిస్తారు. ఈ వేడుకల కోసం ఇప్పటికే భక్తులు తిరుమలకు చేరుకుంటోన్నారు. మలయప్ప స్వామివారిని దర్శించుకోనున్నారు. ప్రతి ఏడాదీ తిరుమలలో గరుడ పంచమిని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిందే.
వైఖానస సంప్రదాయలకు అనుగుణంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు టీటీడీ అర్చకులు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనంద దాయకంగా ఉండటానికి, తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు గరుడ పంచమి పూజలు చేస్తారని పురాణాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications