తిరుమల శ్రీవారి భక్తులను మోసగిస్తోన్న మరో వెబ్‌సైట్- టీటీడీ నిఘాలో
తిరుపతి: కలియుగ వైకుంఠంలా అలరారుతున్న ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. వరుస సెలవులు రావడం, విద్యార్థులకు పరీక్షలు ముగియడంతో తిరుమలలో భక్తుల తాకిడి ఏర్పడింది. క్యూ కాంప్లెక్స్‌లన్నీ కిటకిటలాడుతున్నాయి. మొత్తం 10 కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు వేచి ఉంటోన్నారు. టోకెన్ లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.
శనివారం 72,631 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 38,529 మంది తలనీలాలను సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 2.85 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. మేలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తోన్నారు. దీనికి అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటోన్నారు.

కాగా- శ్రీవారి భక్తులను మోసాలకు గురి చేస్తోన్న వెబ్‌సైట్లపై టీటీడీ అధికారులు కొరడా ఝుళిపిస్తోన్నారు. శ్రీవారి దర్శనం టికెట్లు, వసతి గదులు, ఇ-హుండీ కానుకల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌ను పోలిన విధంగా ఉండేలా సొంత వెబ్‌సైట్‌ను డెవలప్ చేసి, వాటి ద్వారా నకిలీ టికెట్లను మంజూరు చేస్తోన్నట్లు అధికారులు గుర్తించారు. అలాంటి నకిలీ వెబ్‌సైట్లు 40 వరకు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.
ఆ 40 వెబ్‌సైట్లపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, కఠిన చర్యలు తీసుకోవాలని కోరామని ఆయన వివరించారు. తాజాగా మరో వెబ్‌సైట్‌పైనా పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://online.tirupatibalaji.ap.gov.in/. దీనికి బదులుగా tirupatibalaji.ap.gov.org అనే వెబ్‌సైట్ ద్వారా భక్తులను మోసగిస్తోన్నట్లు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వెబ్‌సైట్ యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ నమోదైంది.

శ్రీవారి భక్తులు అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే సందర్శించాలని, నకిలీ వెబ్‌సైట్ల బారిన పడొద్దని టీటీడీ అధికారులు సూచించారు. స్వామివారి దర్శనం టికెట్లు, వసతి గదుల కేటాయింపు, టీటీడీలో ఉద్యోగాల కల్పన.. వంటి మోసాలకు ఆయా వెబ్‌సైట్లు పాల్పడున్నాయని చెప్పారు. సైబర్ నేరగాళ్ల బారిన పడొద్దని, డబ్బలు, సమయాన్ని వృధా చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
అనధికారికంగా 300 రూపాయలకు సంబంధించిన నకిలీ టికెట్లను జారీ చేయడం, భక్తుల నుంచి పెద్ద మొత్తంలో నగదును సేకరించడం, వసతి గదుల కేటాయింపుతో అదనపు మొత్తాన్ని వసూలు చేస్తోండటం వంటి మోసపూరిత కార్యకలాపాలకు ఆయా వెబ్‌సైట్లు పాల్పడుతున్నాయని టీటీడీ ఐటీ విభాగం జనరల్ మేనేజర్ సందీప్ రెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications