టీటీడీ ఆధ్వర్యంలో.. రాజధాని నగరాల్లో
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం నాడు 63,710 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 21,205 మంది తలనీలాలను సమర్పించారు. 4 నుంచి 6 కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు స్వామివారి దర్శనానికి వేచి ఉంటోన్నారు. సర్వదర్శనం కింద స్వామివారి దర్శించుకోవాలనుకునే వారికి ఎనిమిది నుంచి 10 గంటల సమయం పడుతోంది.
హుండీ ద్వారా 3.13 కోట్ల రూపాయల ఆదాయం టీటీడీకి అందింది. కార్తీకమాసారంభం అనంతరం భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లుచేస్తోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటోంది.

ఈ నెల 12వ తేదీన దీపావళి. ఈ సందర్భంగా అదే రోజున దీపావళి ఆస్థానాన్ని నిర్వహించనుంది టీటీడీ. దీపావళి వేడుకల్లో భాగంగా 13వ తేదీన కేదారగౌరీ వ్రతం, 15వ తేదీన భగనీ హస్త భోజనం విశేష ఉత్సవాల కోసం ఏర్పాట్లు సైతం పూర్తి చేస్తోంది. 17వ తేదీన మలయప్ప స్వామివారు పెద్ద శేష వాహనంలో భక్తులను కటాక్షిస్తాడు.
18వ తేదీన శ్రీవారి వార్షిక పుష్పయాగానికి అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది టీటీడీ. 19న శ్రీవారి పుష్పయాగం ఉంటుంది. 20వ తేదీన కార్తీక దీపోత్సవాలకు శ్రీకారం చుట్టనుంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా వివిధ నగరాల్లో, ఆలయాల్లో జరుపనుంది. ధర్మప్రచారంలో భాగంగా కార్తీక దీపోత్సవాలను నిర్వహించినున్నట్లు తెలిపింది.
నవంబరు 20వ తేదీన తిరుపతితో ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టనుంది. అనంతరం 27వ తేదీన కర్నూలు, డిసెంబరు 4వ తేదీన విశాఖపట్నంలో కార్తీక దీపోత్సవాలు నిర్వహిస్తుంది. దీనికోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది. దాతల సహకారంతో ఈ మూడు ప్రాంతాల్లో కార్తీక దీపోత్సవాలు నిర్వహిస్తామని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications