తిరుగుబోతు బ్రహ్మచర్యంపై పుస్తకం రాసినట్టుగా నిమ్మగడ్డ లేఖ : మంత్రి పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు
పదవీ విరమణ చివరి రోజున రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలసంస్కరణలు అంటూ గవర్నర్ కు లేఖ రాయడంపై ఏపీ మంత్రి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పదవిలో ఉన్నన్ని రోజులు చంద్రబాబు మేలుకోసం మెప్పు కోసం పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉద్యోగం ఊడిపోయే చివరిరోజున శ్రీరంగనీతులు చెబుతున్నారని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు.

నిష్పక్షపాతం, పారదర్శకం వంటి పదాలను వాడడం చూస్తుంటే నవ్వొస్తుంది
నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ కు చేసిన సిఫార్సులను చూస్తే తిరుగుబాటు బ్రహ్మచర్యం గురించి పుస్తకం రాశాడు అన్న సామెత గుర్తుకు వస్తోందని పేర్ని నాని తీవ్రపదజాలంతో ద్వజమెత్తారు. ఇక లేఖ ఉపోద్ఘాతంలో ఎన్నికలపై నిమ్మగడ్డ నిష్పక్షపాతం, పారదర్శకం వంటి పదాలను వాడడం చూస్తుంటే నవ్వు వస్తుందని పేర్ని నాని పేర్కొన్నారు. హైదరాబాద్లో ఉంటూ గుంటూరులో ఓటు హక్కు కావాలనడం లోనే ఆయన వైఖరి అర్థమవుతుందని పేర్కొన్న పేర్ని నాని అసలు ఎన్నికల నిబంధనల పట్ల నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు గౌరవం లేదని విమర్శించారు.

బరితెగించి హోటల్ కెళ్ళి సుజనాచౌదరిని, కామినేనిని కలిసి నిమ్మగడ్డ రాజకీయం
2016 నుండి ఇప్పటివరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు కోసమే పని చేశారని చంద్రబాబు రక్షణే ధ్యేయంగా రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహరించిందని విమర్శించారు. అంతేకాదు ఎన్నికల కమిషన్ అంటే రాజకీయ పార్టీలకు దూరంగా ఉండాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెబుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు అని మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. పట్టపగలు బరితెగించి హోటల్ కెళ్ళి సుజనాచౌదరి ని, కామినేని శ్రీనివాస్ ని కలిసి గంటల కొద్దీ రాజకీయ మంత్రాంగం యంత్రాంగం నడిపిన ఏకైక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని మండిపడ్డారు.

ఓటుతో చంద్రబాబుకు , నిమ్మగడ్డకు దిమ్మతిరిగేలా ప్రజలు చేశారు
ఓటుతో చంద్రబాబుకు , నిమ్మగడ్డకు దిమ్మతిరిగేలా ప్రజలు చేశారని మంత్రి పేర్ని నాని అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో నిమ్మగడ్డ చంద్రబాబు కోసం పని చేసినప్పటికీ, చంద్రబాబును ప్రజలు భూస్థాపితం చేస్తారని మంత్రి పేర్ని నాని తెలిపారు.
చంద్రబాబు కోసం నాడు కరోనా సాకుతో ఎన్నికలను రద్దుచేసి, ఇక చంద్రబాబు కోసమే కరోనా కేసులు పెరుగుతుంటే కూడా , కోర్టుకెళ్ళి మరీ ఎన్నికలను ఇప్పుడు నిర్వహించిన ఘనుడు నిమ్మగడ్డ అని మంత్రి పేర్ని నాని మండిపడ్డారు .

పదవీ విరమణ రోజు నిమ్మగడ్డ శ్రీరంగ నీతులు
షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే చంద్రబాబుకు నష్టం జరుగుతుందని, సంవత్సరం తర్వాత ప్రభుత్వం పై వ్యతిరేకత వస్తే అది చంద్రబాబుకు లాభిస్తుందని భావించి, ఆ విధంగా ఎన్నికలను నిర్వహించారని చంద్రబాబు సూచనల మేరకే ఎన్నికలను వాయిదా వేసింది నిజం కాదా అని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. పదవీ విరమణ చివరి రోజున శ్రీరంగనీతులు చెప్తే ఎవరు నమ్ముతారు అంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి పేర్ని నాని.












Click it and Unblock the Notifications