నీతో మాట్లాడాలి..నా రూమ్‌కు రా: మనవరాలి వయస్సు ఉన్న బాలికపై జన సైనిక్ వేధింపులు
విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో ప్రత్యేకించి- విశాఖపట్నంలో బలం పెంచుకోవడానికి ప్రయత్నిస్తోన్న జనసేనకు షాకిచ్చాడు ఆ పార్టీ సీనియర్ నాయకుడొకరు. ప్రేమ పేరుతో మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడ్డాడు. వాట్సప్ లో అసభ్యకర మెసేజీలను పంపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేశాడు. అర్ధరాత్రి కత్తి పట్టుకుని ఆ యువతి ఇంటి ముందు హల్‌చల్ చేశాడు.. ఆమె కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేశాడు.

అజ్ఞాతంలో..
ఈ ఘటనపై ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై ఐపీసీ సెక్షన్ 354, 509, 427 కింద సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనపై కేసు నమోదైన విషయం తెలిసిన వెంటనే నిందితుడు అజ్ఞాతంలో వెళ్లినట్లు చెబుతున్నారు. అతని కోసం పోలీసులు గాలిస్తోన్నట్లు సమాచారం.

జనసేన లీడర్లతో..
అతని పేరు రాఘవరావు. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ సీనియర్ నాయకుడు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్, రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, సీనియర్ నాయకుడు నాగబాబుతో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. వారితో వేర్వేరు సందర్భాల్లో కలిసి ఫొటోలు కూడా దిగాడు. రాఘవరావు వివాహితుడు. పిల్లలు కూడా ఉన్నారు.
బాలికపై వేధింపులు..
కొంతకాలంగా ఓ మైనర్ బాలికపై కన్నేశాడు. చినవాల్తేర్‌లోని ఓ అపార్టుమెంట్ లో నివాసం ఉంటున్న ఓ బాలికకు వాట్సాప్‌లో అసభ్య మెసేజ్‌లు పెట్టడంతో పాటు ప్రేమించాలంటూ ఒత్తిడి చేశాడు. ప్రేమిస్తున్నానంటూ వేధింపులకు గురి చేస్తూ వస్తోన్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాని, మాట్లాడాలి..రూమ్‌కు రా అంటూ వాట్సాప్ మెసేజీలను పంపించేవాడు. తన భార్యకు విడాకులిస్తానని, పెళ్లి చేసుకోవాలనీ ఒత్తిడికి గురి చేస్తుండేవాడు.

కత్తితో రెచ్చిపోయి..
అతని చేష్టలతో ఆందోళన గురవుతున్న ఆ బాలిక- ఎవరికీ చెప్పుకోలేక మానసిక వేదనకు గురైంది. ఆమె మౌనంగా ఉండటంతో రాఘవరావు మరింత రెచ్చిపోయాడు. బుధవారం రాత్రి ఏకంగా ఆమె ఫ్లాట్ కు వెళ్లి రచ్చ చేశాడు. మద్యం సేవించి, కత్తి తీసుకుని ఆ బాలికను బెదిరింపులకు గురి చేశాడు. దీనితో భయభ్రాంతులకు గురైన ఆ బాలిక స్నేహితులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది.

మెగా బ్రదర్స్ అండదండలు..
వారందరూ ఆమె ఫ్లాట్ కు చేరుకుని, రాఘవరావును అడ్డుకున్నారు. తనకు మెగా బ్రదర్స్ నుంచి పుష్కలంగా అండదండలు ఉన్నాయని, పార్టీ పెద్దలకు తాను ఏది చెబితే అదే వేదమని హెచ్చరించాడు. తనని ఎవరూ ఏమీ చేయలేరంటూ అతను మరింత రెచ్చిపోయాడు. ఈ తతంగం తరువాత ఆ బాలిక స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. రాఘవరావుపై పోలీసులు 354, 509, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ఈ ఘటనపై జనసేన స్పందించింది. రాఘవరావుతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications