ఏపీఎస్ఆర్టీసీ సీటింగ్ కమ్ స్లీపర్ కోచ్- ఫుల్ డిమాండ్..!!
అమరావతి: ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలను అందించడానికి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తోన్నారు. వివిధ నగరాలు, జిల్లా కేంద్రాలకు ఇదివరకు స్టార్ లైనర్ 2+1 నాన్ ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకుని వచ్చారు. రద్దీ మార్గాల్లో వాటిని ప్రవేశపెడుతున్నారు. వాటికి ప్రయాణికుల నుంచి అపూర్వ స్పందన లభించిన నేపథ్యంలో మరన్ని కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తోన్నారు.
ఇందులో భాగంగా- నైట్ రైడర్ పేరుతో ఏసీ సీటింగ్ కమ్ స్లీపర్ కోచ్ బస్సులను ప్రవేశపెట్టారు. సీటింగ్ ప్లస్ స్లీపర్ కోచ్ ఇది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మధ్య ఈ బస్సులు పరుగులు పెడుతోన్నాయి. వాటికి కూడా అంచనాలకు మించి ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తోంది. వారాంతపు, సెలవు రోజుల్లో సీట్లు దొరకని పరిస్థితి ఏర్పడిందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వాటి సంఖ్యను మరింత పెంచే ప్రతిపాదనలు ఉన్నాయని అంటున్నారు. 3355 నంబర్ నైట్ రైడర్ బస్సు ప్రతిరోజూ మధ్యాహ్నం 3:30 నిమిషాలకు విశాఖపట్నం ప్రధాన బస్‌స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు తెల్లవారు జామున 5:40 నిమిషాలకు హైదరాబాద్ బీహెచ్ఈఎల్‌కు చేరుకుంటుంది.
3356 నంబర్ మరో సర్వీస్ ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు బీహెచ్‌ఈఎల్ నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు తెల్లవారు జామున 6:30 గంటలకు విశాఖపట్నానికి చేరుకుంటుంది. మద్దిలపాలెం, ద్వారకా బస్టాండ్, అన్నవరం, రాజమండ్రి, విజయవాడ, ఎల్బీనగర్, మహాత్మగాంధీ సెంట్రల్ బస్ స్టేషన్, అమీర్‌పేట్, ఎస్ఆర్ నగర్, కేపీహెచ్‌బీ కాలనీ, మియాపూర్ మీదుగా రాకపోకలు సాగిస్తోంది. ఈ బస్ సర్వీస్ ఛార్జీ 1,413 రూపాయలు.
కాగా ఇప్పటికే స్టార్ లైనర్ పేరుతో నాన్ ఏసీ బస్సులను నడిపిస్తోంది ఏపీఎస్ఆర్టీసీ. రైలు స్లీపర్ కోచ్ లను తలదన్నేలా దీన్ని డిజైన్ చేయడం వల్ల ఈ సర్వీసులకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. నాన్ ఏసీ కావడం వల్ల ఛార్జీ కూడా అందుబాటులోనే ఉంటోంది. వాటి సంఖ్యను భారీగా పెంచుతున్నారు. కొత్తగా వెంకటగిరి- బీహెచ్ఈఎల్, కనిగిరి- బీహెచ్ఈఎల్, చిలకలూరిపేట- బీహెచ్ఈఎల్ మధ్య త్వరలో ప్రవేశపెట్టనున్నారు.












Click it and Unblock the Notifications