ఉత్తరాంధ్ర, కోస్తాలోని ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన
విశాఖపట్నం: నైరుతి రుతుపవనాల ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తోన్నాయి. ఇప్పటికే హైదరాబాద్ సహా పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. మరో 48 గంటల పాటు ఆయా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లో వార్నింగ్‌ను జారీ చేసింది. హైదరాబాద్‌లో శనివారం రాత్రి కురిసిన వర్షాలకు అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి.
ఉత్తర తెలంగాణలోని కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఆది, సోమ వారాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు పడ్డాయి.

ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పార్వతిపురం, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈ రాత్రికి భారీ వర్షం నమోదవుతుందనే అంచనా వేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీకి ఆనుకుని ఉన్న ఒడిశా సరిహద్దు జిల్లాలు, ఆంధ్రా-ఒడిశా బోర్డర్‌లో తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి.
కోస్తా, దక్షిణ రాయలసీమ జిల్లాలకూ వర్ష సూచనలను జారీ చేసింది వాతావరణ కేంద్రం. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు, యానాం, పల్నాడు, బాపట్ల, విజయవాడ, కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ, అరకు, కాకినాడ జిల్లాల్లో కొన్ని చోట్లు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చనే అంచనాలు ఉన్నాయి. నైరుతి రుతుపవనాల రాకతో ఉష్ణోగ్రత పడిపోయింది. కాకినాడ-28, తుని-28, విశాఖపట్నం-29, మచిలీపట్నం-29.5, విజయవాడ- 30 డిగ్రీల మేర ఉష్ణోగ్రత రికార్డయింది.












Click it and Unblock the Notifications