Vande Bharat express: ఏపీకి మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్: రూట్ ఇదే
Vande Bharat express: దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల జోరు రోజురోజుకూ పెరుగుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 54 రైళ్లు పట్టాలెక్కాయి. వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి.
సాధారణ రైళ్లల్లో ఇప్పటివరకు లేని కొన్ని ప్రత్యేకతలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఉండటం వల్ల వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటోంది. పండగ సీజన్లల్లో టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. సాధారణ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ ధర అధికమే అయినప్పటికీ- త్వరితగతిన గమ్యస్థానాలకు చేరడానికి వందే భారత్‌ను ఆశ్రయిస్తోన్నారు ప్రయాణికులు.

ప్రజల నుంచి వీటికి లభిస్తోన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని రైల్వే మంత్రిత్వ శాఖ- వీటి సంఖ్యను మరింత పెంచుతోంది. ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మరిన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకుని రాబోతోంది. ఇటీవలే ఒకేసారి మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు.
తాజాగా మరో 10 వందే భారత్ రైళ్లను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకుని రాబోతోన్నారు. ఈ నెల 15వ తేదీన ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ రూపంలో పచ్చజెండా ఊపి వాటిని ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను రైల్వే అధికారులు చకచకా పూర్తి చేస్తోన్నారు.
టాటా నగర్- పాట్నా, వారణాశి- దేవ్‌గఢ్, టాటానగర్- బరంపురం, రాంచీ- గొడ్డ, ఆగ్రా- వారణాశి, హౌరా- గయ, హౌరా- భాగల్‌పూర్, పుణే- నాగ్‌పూర్‌తో పాటు నాగ్‌పూర్- సికింద్రాబాద్, దుర్గ్- విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్- విశాఖపట్నం రూట్ కూడా ఇప్పటికే ఖరారయింది.
ఈ మార్గంలో ఇప్పటివరకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులో లేదు. దుర్గ్- విశాఖపట్నం మధ్య దూరం 566 కిలోమీటర్లు. ప్రస్తుతం రాకపోకలు సాగించడానికి ప్రస్తుతం 15 నుంచి 16 గంటల సమయం పడుతోంది. వందే భారత్ వల్ల ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది. 6 నుంచి 7 గంటల్లోగా గమ్యాస్థానాలకు చేరుకోవచ్చు.
విజయనగరం జంక్షన్, బొబ్బిలి జంక్షన్, పార్వతిపురం, రాయగడ, ఖండేల్ రోడ్, టిట్లాగఢ్ జంక్షన్, మహాసముంద్, రాయ్‌పూర్ జంక్షన్, భిలాయ్ మీదుగా కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రాకపోకలు సాగిస్తుంది. ఈ మార్గంలో కూడా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపించాలనే డిమాండ్ కొంతకాలంగా వినిపిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని రైల్వే అధికారులు ఈ రైలును అందుబాటులోకి తెచ్చారు.












Click it and Unblock the Notifications