కీలక ప్రకటన విడుదల చేసిన గంటా శ్రీనివాస్..!!
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావును గెలిపించాలని ఆ పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
విశాఖపట్నం: ఏపీ గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల కోసం మార్చి 13వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 16న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ నుంచి బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్ పోటీలో ఉన్నారు. టీడీపీ, బీజేపీ నుంచి వేపాడ చిరంజీవీరావు, పీవీఎన్ మాధవ్ బరిలో నిలిచారు.
వేపాడ కోసం..
ఈ ఎన్నికల్లో వేపాడ చిరంజీవి రావు కోసం తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు రంగంలోకి దిగారు. ఆయనకు మద్దతుగా నిలిచారు. వేపాడకు మద్దతుగా నిర్వహించిన సభల్లోనూ పాల్గొన్నారాయన. ఎల్లుండి పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో- ఇవ్వాళ ఓ ప్రకటన విడుదల చేశారు. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో దీన్ని పోస్ట్ చేశారాయన.
ఏపీ దుస్థితిపై..
అక్షర క్రమంలోనే కాదు.. అంతరిక్ష పరిశోధన వరకు అగ్రగామిగా నిలిచిన ఏపీ- ప్రస్తుతం అత్యంత దుర్భర స్థితిని ఎదుర్కొంటోందని గంటా శ్రీనివాస్ అన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాభివృద్ధి దిశగా కీలక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టే ప్రలోభాలు, ఇచ్చే డబ్బులకు లొంగే సంస్కృతి ఉత్తరాంధ్ర ప్రజలకు లేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, దీన్ని మరోసారి నిరూపించుకోవాలని సూచించారు.

2024 నాటి ఎన్నికలకు..
2024 నాటి సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్ ను మార్చేలా- ప్రజాభిప్రాయం ఉండబోతోందని, దానికి బీజం వేసేలా పట్టభద్రులు ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలని, తెలుగుదేశం పార్టీ బలపరిచిన ప్రొఫెసర్ వేపాడ చిరంజీవి రావును మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని గంటా శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఆయనను గెలిపించి.. రాష్ట్ర పునర్వైభవానికి సహకరిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

శాసన మండలిలో..
ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఉద్యోగులు, నిరుద్యోగులు, వ్యాపారవేత్తలు, అసంఘటిత రంగ కార్మికుల సమస్యలపై శాసన మండలిలో గళం విప్పగల సామర్థ్యం చిరంజీవి రావుకు ఉందని గంటా శ్రీనివాస్ పేర్కొన్నారు. మన ప్రాంత సమస్యలపై చట్ట సభల్లో గొంతెత్తే అవకాశాన్ని చిరంజీవి రావుకు కల్పించాలని సూచించారు. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం ద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త చంద్రబాబు నాయుడి నాయకత్వాన్ని బలపరిచినట్టవుతుందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications