వీడియో: ఏకధాటిగా కుమ్మేసిన వర్షం: విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో పోటెత్తిన వరద నీరు
విశాఖపట్నం: గులాబ్ తుఫాన్ ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలపై భారీగా పడింది. చాలాచోట్ల ఓ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నంపై గులాబ్ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపించింది. ఏకధాటిగా వర్షం పడుతోంది.లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి..నీట మునిగాయి. పలు కాలనీల్లో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. పెదగంట్యాడ హౌసింగ్ బోర్డు కాలనీ, నాయుడు తోట దుర్గానగర్ కాలనీల ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. గాజువాకలో వరద నీరు పోటెత్తింది.
కాన్వెంట్ జంక్షన్‌లో మోకాలి లోతు వర్షపు నీరు
విశాఖపట్నం కాన్వెంట్ జంక్షన్‌లో మోకాలి లోతు వర్షపు నీరు నిలిచింది. ఫలితంగా- వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. లంకెలపాలెం, గాజువాకల్లో రాత్రి నుంచి విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. పెందుర్తి, సుజాతనగర్, సప్తగిరి నగర్ వంటి చోట్ల ఉన్న అపార్ట్‌మెంట్ల్లో భారీగా నీరు చేరింది.
భారీ వర్షాల వల్ల జిల్లాలోని రిజర్వాయర్లు
భారీ వర్షాల వల్ల జిల్లాలోని రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. నిండుకుండల్లా మారాయి. విశాఖ నగరం నీటి అవసరాలను తీర్చే మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్‌కు వరద నీరు పోటెత్తింది. దీనితో జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు నాలుగు గేట్లు ఎత్తి వేశారు. వరద నీటిని దిగువకు విడుదల చేస్తోన్నారు. ఏజెన్సీలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అలాగే- తాటిపూడి ఎత్తిపోతలు, రైవాడ, కోనాం రిజర్వాయర్లలోకి భారీగా వర్షం నీరు చేరింది.
విశాఖ విమానాశ్రయంలోనూ అదే పరిస్థితి
విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. వరద నీరు పోటెత్తింది. విమానాశ్రయం పల్లపు ప్రాంతాల్లో మోకాలి లోతు వరకు వర్షపు నీరు చేరింది. దీనితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విమానాశ్రయం ప్రధాన ద్వారం వద్ద రెండు అడుగుల మేర నీరు చేరింది. వరద నీరు లోనికి ప్రవేశించకుండా ఉండటానికి అధికారులు ఇసుక మూటలను అడ్డుగా పెట్టారు. అయినప్పటికీ.. ఆ ప్రయత్నాలేవీ పెద్దగా ఫలించలేదు. వరద నీరు లోపలికి ప్రవహించింది.
Recommended Video

65 శాతం అధికంగా..
విశాఖపట్నంలో ఈ సంవత్సరం కూడా అధిక వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 483 మిల్లీమీటర్లు కాగా.. 65.8 శాతం అధికంగా అంటే 801 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. గాజువాకలో సాధారణ వర్షపాతం 479 మిల్లీమీటర్లు కాగా 681 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పెందుర్తిలో 569 మిల్లీమీటర్లకు 769, భీమునిపట్నంలో 567కు 670 మిల్లీమీటర్లు, ఆనందపురంలో 598కి 672 మిల్లీమీటర్లు, విశాఖపట్నం అర్బన్‌లో 571కి 749 మిల్లీమీటర్లు, అనకాపల్లిలో 671కి 757 మిల్లీమీటర్లు, పరవాడలో 606కి 704 మిల్లీమీటర్లు, పెదగంట్యాడ 520కి 600 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.












Click it and Unblock the Notifications