విశాఖకు సీఎం క్యాంప్ ఆఫీస్ షిఫ్ట్
విశాఖపట్నం: ఇంకొద్ది రోజులు దసరా మహోత్సవాలు మొదలు కానున్నాయి. ఈ నెల 15వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా ఆరంభం కానున్నాయి. 23వ తేదీన విజయదశమితో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. దీనికోసం అన్ని విజయవాడ కనకదుర్గమ్మ సహా అన్ని ఆలయాలు ముస్తాబవుతున్నాయి.
విజయదశమి నాడే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నానికి తరలి వెళ్లనున్నారు. తన క్యాంప్ కార్యాలయాన్ని సాగర నగరానికి షిఫ్ట్ చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. విశాఖపట్నంలో క్యాంప్ కార్యాలయ నిర్మాణం తుదిదశకు చేరుకుంది. రుషికొండ వద్ద సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మితమౌతోంది.

ప్రస్తుతం అమరావతి ప్రాంతంలోని తాడేపల్లిలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచీ ఎక్కువ శాతం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి పరిపాలన సాగిస్తోన్నారు వైఎస్ జగన్. అధికారిక సమీక్షలు అధికంగా క్యాంప్ కార్యాలయంలోనే జరిగాయి.
విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా బదలాయించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో- అక్కడికి తరలి వెళ్లడానికి ఏర్పాట్లు చేస్తోన్నారు వైఎస్ జగన్. విజయదశమి నాడు గృహ ప్రవేశం చేయనున్నారు. దీనితో- క్యాంప్ కార్యాలయ తుదిదశ నిర్మాణ పనులను వేగం పుంజుకొన్నాయి.
క్యాంప్ కార్యాలయం తరలింపు పనులను పర్యవేక్షించడానికి, వీటిని మరింత ముమ్మరం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ముగ్గురు అధికారులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసింది. మున్సిపాలిటీ- పట్టణాభివృద్ధి, ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఇందులో సభ్యులు. క్యాంప్ కార్యాలయ తరలింపు ఏర్పాట్లన్నింటినీ ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.
క్రమంగా- అన్ని శాఖలు, విభాగాధిపతుల కార్యాలయాలు విశాఖకు షిఫ్ట్ అవుతాయి. డిసెంబర్ నాటికి పూర్తిస్థాయిలో విశాఖపట్నం పరిపాలన రాజధానిగా మారుతుందనే అంచనాలు ఉన్నాయి. మంత్రుల నివాసాలకు అవసరమైన భవనాల ఎంపిక సైతం వేగంగా సాగుతోంది.












Click it and Unblock the Notifications