వైసీపీ పాలనకు రెఫరెండంగా ఎమ్మెల్సీ ఎన్నికలు..నేతలేం చెబుతున్నారు?
విశాఖపట్నం: రాష్ట్రంలో శాసన మండలి ఎన్నికల వేడి రాజుకుంది. మొత్తం 14 నియోజకవర్గాలకు మార్చిలో పోలింగ్ జరుగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు ఇటీవలే షెడ్యూల్ ను విడుదల చేశారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ తమ తమ అభ్యర్థులను ఎంపిక చేసుకుంటోన్నాయి.

సెమీ ఫైనల్స్..
2024లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు వీటిని సెమీ ఫైనల్స్ గా భావిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా పార్టీలన్నీ ఈ ఎమ్మెల్సీ పోల్స్ ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఈ సాయంత్రం జరిగిన వైఎస్ఆర్సీపీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికలను ప్రత్యేకంగా ప్రస్తావించారంటే- దీన్ని ఆయన ఏ స్థాయిలో తీసుకున్నారనేది అర్థం చేసుకోవచ్చు.

స్థానిక సంస్థల్లో..
మొత్తం 14 ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో రెండు ఉపాధ్యాయులు, మూడు పట్టభద్రుల నియోజకవర్గాలు ఉన్నాయి. మిగిలిన తొమ్మిది కూడా స్థానిక సంస్థలకు సంబంధించిన కోటాకు చెందినవి. స్థానిక సంస్థల కోటాలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. స్థానిక సంస్థల కోటాలో 90 శాతం వరకు వైఎస్ఆర్సీపీకి చెందిన ప్రజా ప్రతినిధులే ఉన్న నేపథ్యంలో ఈ కేటగిరీలో ఎన్నిక ఏకపక్షంగా మారడానికే అవకాశాలు ఉన్నాయి.

అభ్యర్థుల ఎంపిక కోసం..
ఈ తొమ్మిది స్థానాల కోసం అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉంది వైసీపీ అగ్ర నాయకత్వం. జిల్లాలవారీగా ఆశావహులు జగన్ ను కలుసుకుంటోన్నారు. అనంతపురం, కడప, కర్నూలు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, నెల్లూరు, శ్రీకాకుళం, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన నాయకులు అభ్యర్థిత్వాన్ని ఆశిస్తోన్నారు.

విజయం ఖాయం..
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీతంరాజు సుధాకర్ ను నిర్ణయించామని, ఆయన విజయానికి పార్టీ నాయకులందరూ కృషి చేయాలని అన్నారు.

విశాఖకు
దశాబ్ధాలుగా వెనకబడి ఉన్న ఈ ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోన్నారని, ఇందులో భాగంగా విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా చేయనున్నారని తెలిపారు. సామాజిక అసమానతలు, ప్రాంతాల మధ్య వ్యత్యాసాలను పూర్తిగా మార్చడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని పేర్కొన్నారు.

రెఫరెండంగా..
ఈ ఎన్నికలను వైసీపీ పాలనకు రెఫరెండంగా తీసుకోదలచుకోలేదని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సాధారణ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలకు తేడా ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 80 శాతం ప్రజలు తమ పార్టీ వైపే ఉన్నారనడానికి స్థానిక సంస్థల్లో సాధించిన ఘన విజయాలే నిదర్శనమని, అంతకంటే ఉదాహరణ ఇంకేం కావాలని ఆయన పేర్కొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామనీ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications