శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ ఎవరిదో వెల్లడించిన జీఎంఆర్
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపనరాయి పడింది. ఈ విమానాశ్రయం నిర్మాణానికి కొద్దిసేపటి కిందటే వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. 2026 నాటికి ఈ విమానాశ్రయం నిర్మాణం పూర్తి కానుంది. అదే ఏడాది జూన్ నాటికి కమర్షియల్ ఆపరేషన్స్‌ను ప్రారంభించనుంది.
భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన అనంతరం రావివలసలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ సహా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాకే చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, జీఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీల అధినేత గ్రంధి మల్లికార్జున రావు ఈ సభకు హాజరయ్యారు. ఈ ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులను జీఎంఆర్ గ్రూప్ కంపెనీ దక్కించుకుంది.

ఈ సభలో గ్రంధి మల్లికార్జున రావు మాట్లాడారు. జీఎంఆర్ సంస్థ తరఫున శంషాబాద్‌లో మొట్టమొదటి సారిగా అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాన్ని నిర్మించానని గుర్తు చేసుకున్నారు. ఆ తరువాత తమ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అనేక విమానాశ్రయాలను కట్టిందని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన చేతుల మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారని, మళ్లీ ఆయనే ప్రారంభించారని చెప్పారు.
హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేసింది వైయస్ఆర్..!!#YSR #YSRajasekharReddy #HyderabadAirport #Hyderabad #BhogapuramAirport #YSjagan #GMR #GrandiMalliKharjunRao #Oneindiatelugu pic.twitter.com/0hIX3lQlPo
— oneindiatelugu (@oneindiatelugu) May 3, 2023
తమ తొలి విమానాశ్రయాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా కట్టి, ప్రారంభించామని, ఇప్పుడు అదే సెంటిమెంట్ ఇక్కడ కూడా కొనసాగుతుందని గ్రంధి మల్లికార్జున రావు చెప్పారు. ఇప్పుడు ఆయన కుమారుడు వైఎస్ జగన్ చేతుల మీదుగా భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని కట్టబోతోన్నామని, మళ్లీ ఆయనే దీన్ని ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వల్ల తెలంగాణ ఎకానమీ మారిపోయిందని వ్యాఖ్యానించారు. శంషాబాద్‌ను మించిన స్థాయిలో భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్ట్‌ను నిర్మిస్తామని మల్లికార్జున రావు హామీ ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధికి ఎకనమిక్ గ్రోత్ ఇంజిన్‌గా ఈ ఎయిర్‌పోర్ట్ మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంత రూపురేఖలు మారిపోతాయని, వేలాదిమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని చెప్పారు.












Click it and Unblock the Notifications