వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిలికానాంధ్ర కుటుంబ శిబిరం

By Staff
|
Google Oneindia TeluguNews

అమెరికా అడవుల్లో సిలికానాంధ్ర సంస్ధ నిర్వహించిన మూడో కుటుంబ శిబిరానికి హాజరైన దాదాపు మూడు వందల మంది తెలుగు గ్రామాలను చూసిన అనుభూతి పొందారు. కాలిఫోర్నియాలోని లాహొండా కొండల మధ్య అడవుల్లో ఏప్రిల్‌ 28 నుంచి 30 వరకు ఆహ్లాద వాతావరణంలో జరిగిన ఆంధ్ర కుటుంబ శిబిరానికి హాజరైన వారు మధురానుభూతులతో తిరిగి వెళ్ళారు. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రపంచం చిన్న గ్రామంగా మారిపోయింది. కంప్యూటర్‌లోని మౌజ్‌ క్లిక్‌లో ప్రపంచం ఒదిగిపోతోంది. అయినా మనుషుల మధ్య, మనసుల మధ్య అంతరాలు తగ్గకపోగా పెరిగిపోతున్నాయి. అందుకే మన ఊరికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అందరినీ ఒక చోటికి తెచ్చి రెండు రోజుల పాటు ఉమ్మడి కుటుంబ మాధుర్యాన్ని వారి అనుభవంలోకి తేవడమే ఈ కుటుంబ శిబిరం లక్ష్యం అని సిలికానాంధ్ర అధ్యక్షుడు కిరణ్‌ ప్రభ ఒక ప్రకటనలో తెలియజేశారు.

శుక్రవారం సాయంత్రం ఆరుగంటలకల్లా శిబిరవాసులంతా అడవుల్లోని చెక్క కాటేజీలకు చేరుకున్మారు. సిలికానాంధ్ర కార్యకర్తలు గిరిజనుల వస్త్రధారణతో ఆహూతులను ఆత్మీయంగా ఆహ్వానించారు. ఆ రాత్రి అందరికీ కమ్మటి తెలుగు భోజనం వడ్డించారు. ఆ తరువాత డ్రేక్‌ థియేటర్లో చెరుకుపల్లి శ్రీనివాస్‌ వీణ కచేరి జరిగింది. తర్వాత చల్లా హిమబిందు తన శిష్య బృందంతో కలిసి కూచిపూడి నాట్య ప్రదర్శన చేశారు. మృత్యుంజయుడు రచించిన పందిరి సందడి హాస్య గల్పిక అందరినీ నవ్వించింది. ఒక తెలుగు పల్లెలో శ్రీరామ నవమి పందిట్లో జరిగే తమాషా సన్నివేశాలను ప్రదర్శించారు. ఊరి మునసబు ఆవుల కనకారావు వేదిక మీదికి రావడం, ఆయన తరచు ఆవు వ్యాసాన్ని వల్లె వేయడం నవ్వు తెప్పించింది. అదే గల్పికలో జూనియర్‌ ఎన్టీఆర్‌, జూనియర్‌ చిరంజీవి వేటగాడు పాటకు డ్యాన్స్‌ చేశారు. మాయాబజార్‌ సినిమాను ఆరుబయట గుడ్డ మీద ప్రదర్శించడం అచ్చం పల్లె వాతావరణాన్ని తలపింపజేసింది.

శనివారం ఉదయమే శిబిరవాసులంతా కోడికూతతో వెంకటేశ్వర సుప్రభాతం వింటూ నిద్రలేచారు. హరిదాసు భగవన్నామ స్మరణ చేస్తూ ప్రతి కాటేజికీ రావడం మాటల్లో చెప్పలేని ఒక మధురానుభూతి. ఉదయం ఫలహారాలు చేసేటప్పుడు అక్కడికి ఆకస్మికంగా గంగిరెద్దు రావడంతో పిల్లలు ఆనందంతో కేరింతలు కొట్టారు. శనివారం ఉదయం పిల్లలు హస్త కళల్లో శిక్షణ పొందుతుండగా పెద్దలు గ్రామీణ క్రీడల్లో మునిగిపోయారు. సిలికాన్‌ వ్యాలీలోని ప్రముఖ కంపెనీల ఉన్నతాధికారులు కూడా తమ గ్రామ లోకంలో విహరించారు. కబడ్డీ, ఖోఖో, గిల్లిదండ, వాలీబాల్‌, గోలీలాటలు ఆడుకున్నారు. మహిళలు తొక్కుడు బిళ్ళ, అష్టాచెమ్మా తదితర ఆటలు ఆడారు. మొత్తం క్రీడా స్ధలమంతా తెలుగు పల్లె క్రీడలతో నిండిపోవడం ఒక మనోహర దృశ్యం. మూడు వందల మందికి ఆ మధ్యాహ్నం విస్తరాకుల్లో నేలమీద పంక్తి భోజనం వడ్డించారు. అదొక పెళ్ళి వాతావరణాన్ని తలపింపజేసింది. శనివారం సాయంత్రం అందరూ ఫ్యామిలీ ఫన్‌ గేమ్స్‌లో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో గోలీ సోడాలు హైలైట్‌ అయ్యాయి. పదిహేనేళ్ళ వయసు గల చెముడుపాటి తేజ చేసిన కర్రసాముకి కరతాళ ధ్వనులు విన్పించాయి. పక్కనే ఉన్న 200 అడుగుల ఎత్తుగల కొండచరియల మీద మద్దాలి కార్తీక్‌ తయారు చేసిన 60 అడుగుల కోట సెట్టింగ్‌ నేపధ్యంలో రాణీ రుద్రమదేవి నాటికలోని ముఖ్య ఘట్టాన్ని మాడభూషి విజయ సారధి దర్శకత్వంలో ప్రదర్శించారు. అర్ధరాత్రి అమెరికా కొండలు రాణీ రుద్రమదేవి సింహ గర్జనలతో మారు మోగాయి.

ఆదివారం జరిగిన ఇడ్లీలు ఆరగించే పోటీ సరదాగా జరిగింది. ఆరోజు సాయంకాలం మ్యూజికల్‌ చైర్స్‌ వంటి ఆటలు ఆడుకుని శిబిర వాసులు మధుర స్మృతులతో ఇంటిదారి పట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X