ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్, డీఏల విడుదల - పీఆర్సీ పై కీలక నిర్ణయం..!!
తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటనకు కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్ తో ఉద్యోగ సంఘాల నేతల సమావేశం సమయంలో కీలక అంశాల పైన చర్చించారు. దీంతో.. సీఎం సానుకూలంగా స్పందించారు. డీఏలు విడుదల దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే, పీఆర్సీ పైన సీఎం రేవంత్ కీలక హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాల నేతల సమాచారం. దీంతో.. ప్రభుత్వం చేసే ప్రకటన పైన ఉద్యోగుల్లో ఆసక్తి నెలకొంది.
తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు రెండు డీఏ(కరవు భత్యం)లు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌తో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశం అయ్యారు. అన్ని అంశాలపై ఆర్థిక శాఖ అధికారులతో చర్చిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. కనీసం రెండు డీఏలు చెల్లిస్తే ప్రభుత్వంపై ఏటా దాదాపు రూ.6 వేల కోట్ల భారం పడుతుందని ఆర్ధిక శాఖ అంచనా వేసారు. ఈ రోజు లేదా రేపు డీఏ పైన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నెల 18న ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశం నిర్వహించనున్నందున ఆరోజు ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయన్న ఉద్యోగ సంఘాల నాయకులు, 3 డీఏల విడుదలపై అసెంబ్లీ సమావేశాల్లోనే ఉత్తర్వులివ్వాలని కోరారు. తెలంగాణలో దసరా పెద్ద పండుగ అని, అప్పటి నుంచే పీఆర్సీ అమలయ్యేలా చూడాలని కోరగా రంజాన్ కూడా పెద్ద పండుగే కదా అని సీఎం నవ్వుతూ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

ముందుగా డీఏల విడుదల... పీఆర్సీ పై చర్చలు
అదే విధంగా పీఆర్సీ నివేదిక అందిన తర్వాత పరిశీలించి ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించి ఖరారు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యాక ఆర్థిక శాఖతో సమావేశమై ఆర్థిక పరిస్థితిని సమీక్షించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని సీఎం తెలిపారని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. అయితే.. ఉద్యోగులకు ఇప్పటి వరకు మొత్తం గా ఐదు డీఏలు మంజూరు చేయాల్సి ఉండగా, అందులో మొదటి దానికి రూ.3,700 కోట్లు, రెండో దానికి రూ.2,300 కోట్ల ఆర్థిక భారం పడుతుందని అంచనా చేస్తున్నారు. రెండు డీఏలను ఇప్పటికిప్పుడు మంజూరు చేసి వచ్చే నెల 1వ తేదీ జీతాల నుంచి ఉద్యోగులకు చెల్లిస్తే నెలకు కనీసం రూ.500 కోట్ల అదనపు ఆర్థిక భారం పడుతుందని ప్రాథమిక అంచనా. రెండు డీఏలు ఇస్తే రూ.6 వేల కోట్ల ఆర్థిక భారం ఏటా భరించాల్సి ఉన్నందున అంత మేరకే ఆర్థిక శాఖ వివరాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీంతో.. డీఏ పైన ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నేతలు భావిస్తున్నారు.













Click it and Unblock the Notifications
