హూస్టన్‌లో అమెరికా తెలుగు సాహితీ సదస్సు
ఐదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు ఈ నెల 14, 15 తేదీల్లో హూస్టన్‌లో జరుగనుంది. ఈ సదస్సులో సాహిత్యంలో హాస్యం అనే అంశంపై చర్చ జరుగుతుంది. ఈ సదస్సులో పాల్గొనడానికి భారత్ నుంచి బాపు, డాక్టర్ పప్పు వేణుగోపాలరావు, జయ ఇప్పటికే అమెరికా చేరుకున్నారు. ప్రముఖ సాహితీవేత్త విజయబాబు ఈ నెల 12వ తేదీన అమెరికా చేరుకుంటారు. ఆ సదస్సులో ఆర్‌యంబి రాఘవేంద్రరావు, యన్‌యస్‌యన్ మూర్తి, శ్రీపతి కూడా ప్రసంగిస్తారు. ప్రముఖ జానపద గాయకురాలు అనుసూయా దేవి, అమెరికాలో వుంటున్న తొలితరం తెలంగాణ కథా రచయిత్రి నందగిరి ఇందిరాదేవి కూడా ఈ సదస్సుకు హాజరవుతారు.
ఉత్తర అమెరికాలోని ప్రముఖ తెలుగు రచయితలు డాక్టర్ వేలూరి వెంకటేశ్వరరావు, డాక్టర్ పెమ్మరాజు వేణుగోపాలరావు (అట్లాంటా), కొమరవోలు సరోజ (టొరంటో, కెనడా), మాచిరాజు సావిత్రి (సిఎ), సత్యం మందపాటి (ఆస్టిన్), చంద్ర కన్నెగంటి (డల్లాస్), మాధవరావు గోవిందరాజుల (సాన్ ఆంటోనియో), విన్నకోట రవిశంకర్, శ్రీనాథ్ జొన్నవిత్తుల, సరళా పూర్ణ (చికాగో), భావరాజు మూర్తి (న్యూజెర్సీ), లైలా ఎర్నేని (ఫ్లోరిడా) తదితరులు ఈ సదస్సుకు హాజరవుతారు.
ఈ సదస్సులో అమెరికా తెలుగు కథ తొమ్మిదో సంపుటి, వంగూరి చిట్టెన్‌రాజు అమెరికామెడీ, డాక్టర్ శేషు శర్మ ప్రవాసాంధ్రుల ఆశాకిరణం కథాసంపుటి, డాక్టర్ పెమ్మరాజు వేణుగోపాలరావు శృంగార భర్తృహరి, డాక్టర్ ఎ. అనసూయాదేవి జానపద గేయాలు పుస్తకాల ఆవిష్కరణ వుంటుంది. ఈ సదస్సు సందర్భంగా బాపుకు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రదానం చేస్తారు. బాపు పెయింటింగ్స్‌పై ఒక గంట సిడి ప్రదర్శన వుంటుంది. అన్నమయ్య, తిరుమల వెంకటేశ్వరులపై పప్పు వేణుగోపాలరావు ఒక గంటపాటు మల్టీ మీడియా ప్రజెంటేషన్ ఇస్తారు.












Click it and Unblock the Notifications