అలరించిన పద్మాకర్ అష్టావధానం
అమెరికాలోని సిలికాన్ వేలీలో ఆగస్టు 6వ తేదీన బే ఏరియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో సహస్రావధాని, త్రిభాషావధాని వద్దపర్తి పద్మాకర్ అష్టావధానం అత్యంత రసవత్తరంగా ఆహూతులను ఆకట్టుకుంది. అద్భుతుమైన ధారణతో, రసభరితమైన పద్యవిన్యాసాలతో, చతురోక్తులతో సాగిన కార్యక్రమానికి విచ్చేసిన తెలుగువారందరూ మూడు గంటలపాటు మంత్రముగ్ధులై ఈ అష్టావధానాన్ని తిలకించారు. తను చేసే ఈ అవధానం అయిదు వందలవ అవధానంగా అమెరికాలో జరగడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని చెబుతూ కేవలం తెలుగువారికి మాత్రమే సొత్తు అయిన ఈ సాహితీ ప్రక్రియను పది కాలాలపాటూ పరిరక్షించుకోవాలని తెలుగువారికి పద్మాకర్ విజ్ఞప్తి చేశారు. ఆశువుగా పద్యాన్ని హృద్యంగా మలచి, సంగీత పరిమళాలు అద్ది, పద్మాకర్ అవధానానికి సరికొత్త వన్నెలు తెచ్చి ప్రవాసాంధ్రులని రంజింపజేశారు.
ఈ అష్టావధానంలో తన వాక్చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకొంటూ ఉపద్రష్ట సత్యం సమన్వయకర్తగా వ్యవహరించారు. పృచ్చకులు సమస్యని కుమారి ప్రణవ, దత్తపది గుండా శివచరణ్, నిషిద్ధాక్షరి తల్లాప్రగడ రామచంద్రరావు, వర్ణన శ్రీనివాసాచార్యులు, ఆశువు శ్రీమతి అపర్ణ, మునుకుట్ల గునుపూడి, న్యస్తాక్షరి రమణ లక్కరాజు, పురాణ పఠనం శ్రీకొండ శాస్త్రి, అప్రస్తుత ప్రసంగం సాయి బ్రహ్మానందం గొర్తి నిర్వహించారు.
బే ఏరియా తెలుగు సంఘం (బాటా) తరఫున పద్మాకర్‌ని విజయ ఆసూరి, వీరు ఉప్పల, యుగంధర్ సత్కరించారు. తానా తరఫున ట్రస్టీ చైర్మన్ సతీష్ చిలుకూరి, కోమటి జయరాం, రమేష్ మందలపు, గోపీ రెడ్డి పద్మాకర్‌కి జ్ఞాపికలందజేశారు.












Click it and Unblock the Notifications