బే ఏరియాలో మెగా బతుకమ్మ

మృత్యుంజయుడి గౌరీ పూజతో కార్యక్రమం ప్రారంభమైంది. ప్రముఖ రేడియా ఆర్టిస్టు, ప్రముఖ జానపద గాయకుడు స్వర్గీయ మానప్రగడ నరసింహమూర్తి భార్య శ్రీమతి రేణుకా దేవి తొలి బతుకమ్మ గేయం ఆలపించారు. ఆ తర్వాత మహిళలు బతుకమ్మ పాటలను అందుకున్నారు. ఊహించినదాని కన్నా ఎక్కువ మంది రావడంతో మధ్యాహ్న భోజనం సరిపోలేదు. అందుకు బిక్షం పాలబిందెల, విజయ్ చవ్వా క్షమాపణలు చెప్పారు. వెంటనే పిజ్జాలు తెప్పించి లోటును పూడ్చారు.
సన్నివాలే మేయర్ టోనీ స్పిటలేరీ బతుకమ్మ ఉత్సవాన్ని సందర్శించారు. భారత గ్రామీణ వాతావరణాన్ని వీక్షించే అదృష్టం తనకు దక్కిందని ఆయన అన్నారు. బతుకమ్మ ప్రత్యేకతను అడిగి తెలుసుకున్నారు. బే ఏరియాలోని తమ నగరానికి బతుకమ్మ ఉత్సవం ప్రాధాన్యాన్ని తెలియజెప్పినందుకు ఆయన టిసిఎకు కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం 35 బతుకమ్మల్లో ఉత్తమ బతుకమ్మను ఆయన ఎంపిక చేశారు. విజేతకు ఐ పోడ్ బహూకరించారు.
మేయరును టిఎసి చైర్మన్ విజయ చవ్వా సంప్రదాయబద్దమైన శాలువాతో సత్కరించారు. యాషాల బాలయ్య చిత్రాన్ని బహూకరించారు. బాలయ్య చిత్రప్రదర్శనను ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతిని పరిరక్షిస్తున్నందుకు ఆయన ఎన్నారైలకు కృతజ్ఞతలు తెలియజేశారు. సిలికానాంధ్ర అధ్యక్షుడు ఆనంద్ కూచిబొట్ల ప్రసంగించారు. తాము అక్టోబర్ 4వ తేదీన కూపిర్టినోలోని ఫ్లింట్ సెంటర్ లో 2000 మందితో సద్దుల బతుకమ్మ ఉత్సవాన్ని నిర్వహిస్తామని ఆయన చెప్పారు. తానా అధ్యక్షుడు జయరాం కోమటి బాటా అధ్యక్షుడు రవి తిరువీధుల ద్వారా తన సందేశాన్ని పంపారు. రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన ఎన్నారైలు బతుకమ్మ ప్రత్యేకతను అడిగి తెలుసుకున్నారు. తన గర్ల్ ఫ్రెండ్ తో వచ్చిన అమెరికా యువకుడు ఇవాన్ పోంటిక్ భారత గ్రామీణ ప్రాంతాన్ని చూడాలనే కోరిక ఈ ఉత్సవం ద్వారా కొంత తీరిందని అన్నాడు. మాధురి కిశోర్ కూచిపూడి డ్యాన్స్ అకాడమీ, విశ్వశాంతి భరతనాట్యం డ్యాన్స్ అకాడమీల నుంచి వచ్చినవారు దాదాపు 30 నిమిషాల పాటు నృత్యప్రదర్శనలు ఇచ్చారు.












Click it and Unblock the Notifications