చికాగోలో సాహిత్య గోష్ఠి

కార్యక్రమంలో ముందుగా ప్రసంగించిన అశోక్ తెలంగాణ జానపద కళల గురించి చక్కని పరిచయం చేశారు. ఆసక్తిదాయకమైన జానపద గేయాలను సభారంజకంగా వినిపించారు. అమెరికాలో తెలుగువారి జీవన విధానంపై జానపద బాణీలో ఆయన స్వయంగా రచించి వినిపించిన గేయం సభను అలరించింది. తరువాతి వక్త డాక్టర్ చింతం రాణి సంయుక్త తన ఇటీవలి భారత పర్యటనలో ఒక ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ముంపునకు గురైన స్వగ్రామం సందర్శించినప్పుడు పొందిన భావోద్వేగాన్ని సాధారణీకరించి ప్రసంగిచారు.
తర్వాత ప్రధాన వక్త ఆచార్య పరిమి రామనరసింహం ఆధునిక సాహిత్యంలో అభివ్యక్తి వైచిత్రి గురించి మాట్లాడారు. భాషలోని సాధారణమైన మాటలే సాహిత్యంగా పరిణమించే విధానాన్ని ఆయన పలు ఉదాహరణలతో అందరికీ అర్థమయ్యేలా వివరించారు. తిలక్ అమృతం కురిసిన రాత్రి కవితా సంకలనంలోంచి కొన్ని ఖండికలను విశ్లేషించి చూపుతూ తిలక్ కవిత్వంలోని అబ్బురపరిచే అంశాలను అత్యంత సులభశైలిలో వివరించారు. ఎన్నో ఏళ్లుగా స్వదేశానికి దూరంగా ఉంటూ కూడా మాతృభాషపై పట్టునూ సాహిత్యంపై ఆసక్తినీ నిలుపుకుంటున్న సభికులను రామనరసింహం అభినందించారు.
రామనరసింహం చేసిన ప్రసంగం గంటన్నరకు పైగా సాగింది. సభికులు వేసిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. సభా ప్రారంభంలో ప్రకాష్ స్వాగతం పలుకగా, జయదేవ్ వందన సమర్పణ చేశారు.












Click it and Unblock the Notifications