గ్రేటర్ ఇండియానాపోలీస్ తెలుగు సంఘం (గీతా), వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంయుక్త ఆధ్వర్యంలో 7వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా హిందీ అకాడమీ అధ్యక్షుడు, పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ... యునెస్కో అంచనా ప్రకారం రానున్న 22ఏళ్లలో మృతభాషల జాబితాలో తెలుగు కూడా చేరే ప్రమాద ముందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని అరికట్టాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడిపై ఉందన్నారు. 'గీతా' అధ్యక్షుడు పొణుగోటి అజయ్ మాట్లాడుతూ భవిష్యత్‌లో సంస్థ ఆధ్వర్యంలో తెలుగు భాషాభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇండియానా పోలీస్‌లోని క్లారియన్ హోటల్‌లో ఏర్పాటుచేసిన సదస్సుకు డాక్టర్ అక్కిరాజు సుందర రామకృష్ణ, మందా భానుమతి, ఆస్టిన్ విశ్వవిద్యాలయ తెలుగు అధ్యాపకులు అప్పర్, బి.ఎస్.రాములు, అఫ్సర్ తదితరులు పాల్గొన్నారు. సదస్సు ఏర్పాట్లను రాము చింతల, శేఖర్ కృష్ణమనేని, శర్మ, మోహన్ దేవరాజ్, శివప్రసాద్, సాదు వినోద్ తదితరులు పర్యవేక్షించారు.