హనీమూన్ పేరిట భార్యను దక్షిణాఫ్రికాకు తీసుకెళ్లి కిరాయి హంతకులతో చంపించాడనే ఆరోపణలపై ప్రవాస భారతీయుడు శ్రీయెన్ దివానీ (30)ని పోలీసులు అరెస్టు చేశారు. బ్రిస్టల్‌లో దివానీని అదుపులోకి తీసుకున్న ఎక్సట్రడిషన్ యూనిట్ పోలీసులు లండన్ వెస్ట్‌మినిస్టర్ న్యాయస్థానం ముందుంచనున్నారు. బ్రిటన్, దక్షిణాఫ్రికాల మధ్య ఖైదీల మార్పిడి ఒప్పందం మేరకు దక్షిణాఫ్రికా పోలీసులకు అప్పగించే అవకాశం ఉంది. భారతీయ స్వీడిష్ పౌరురాలైన తన భార్య అనీ దివానీతో హనీమూన్ కోసం దక్షిణాఫ్రికా వెళ్లగా గతనెల 13న కొంతమంది దుండగులు అనీని అపహరించి, హత్య చేశారని శ్రీయెన్ పోలీసులకు చెప్పి బ్రిటన్ వెళ్లిపోయారు. అయితే, దక్షిణాఫ్రికా పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా శ్రీయెన్ దంపతులు కిరాయికి కుదుర్చుకున్న కారు డ్రైవర్‌ను విచారించినప్పుడు వాస్తవాలు తెలిశాయి.