అమెరికాలో తెలుగు సాహిత్య వెన్నెల

మధురాంతకం నరేంద్ర ఆధ్వర్యాన వెలువడ్డ కథాసంకలనం ‘కథావార్షిక 2010’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ డా.బోయరెడ్డి సుబ్రహ్మణ్యం, మధురాంతకం రాజారాంతో తనపరిచయం గురించి, 1999 నుండి ప్రతిసంవత్సరం జరుగుతున్న కథావార్షిక ప్రచురణ గురించి క్లుప్తంగా చెప్పడమే కాకుండా తనకు బాగా నచ్చిన కథ ‘చిట్టచివరి సున్నా’లో కొన్ని భాగాలను చదివి వినిపించారు. ఈ పుస్తకావిష్కరణలో భాగంగా, పుస్తకం మందుమాటలో కథల సింహావలోకనం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మద్దుకూరి చంద్రహాస్ తెలియజేయగా, కొన్ని కథలను క్లుప్తంగా డా.జువ్వాడి రమణ సభకు పరిచయం చేసారు.
అనంతరం పదేళ్ళ చిన్నారి రాయవరం స్నేహిత్ పారిజాతాపహరణంలోని కొన్ని పద్యాలను అర్థ తాత్పర్యాలతోచదివి వినిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తరువాత శ్రీమతి వేదుల గౌరి శాస్త్రి, కవయిత్రి వేదుల మీనాక్షీ దేవి గురించి పరిచయంచేసి మీనాక్షీ దేవి సంస్కృతాంధ్ర భాషల్లో కావ్యాలు వ్రాశారని, ఆ రోజుల్లో స్త్రీలలో అంతటి పాండిత్యం అరుదని అన్నారు. మీనాక్షీ దేవి సాహిత్యవ్యాసాలనుండి రామతత్వం ఎరిగిన స్త్రీలు అన్న వ్యాసాన్ని ఉదహరించారు. మల్లవరపు అనంత్ 2011 సంవత్సరాన్ని సమీక్షిస్తూ ఈ యేటి "నెల నెలా తెలుగు వెన్నెల" కార్యక్రమాలను సింహావలోకనం చేశారు.
అనంతరం, ముఖ్య అతిథి, ‘ఢీ’, ‘రెడీ’, ‘దూకుడు’తదితర విజయవంతమైన చిత్రాల రచయిత కోన వెంకట్ ప్రసంగిస్తూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను సభతో పంచుకున్నారు. మనసుకవి ఆత్రేయతో తన పరిచయాన్ని స్మరించుకున్నారు. సామాన్యులకి దగ్గరగా వున్నదే సాహిత్యమని, చెప్పేవిధానం, మాటలు కధను ప్రేక్షకులకు చేరువగా తీసుకెళ్తాయని, సినిమా వ్యాపార మాధ్యమని, అందుకోసం కొన్నిసార్లు ప్రజలను రంజింపజేయడానికి పరభాషాపదాలను వాడవలసి వస్తుందని వివరించారు. ‘డాలస్ నాగేశ్వరరావు’ అనే పాత్ర నిజంగానే తనకు నిజజీవితంలో తారసపడిందని చెప్తూ, ఆయనకు డాలస్ వాసులకు కృతజ్ఞతలు తెలియ జేశారు.
చివరగా ‘కింగ్’ తదితర సినిమాల రచయిత, 'వాంటెడ్’ చిత్ర దర్శకుడు శ్రీ బివియస్ రవి ఆదికాలంనుండి ఇప్పటి వరకూ తెలుగు భాషలో వచ్చిన పరిణామాలు వివరిస్తూ సినిమాకోసం భాషను సరళీకృతం చేసుకోవడం మొదటి నుంచీ జరుగుతున్నదానికి విరుధ్ధం కాదన్నారు. కోన వెంకట్, బివియస్ రవిలను టాంటెక్స్ అధ్యక్షుడు ఎన్‌ఎమ్‌ఎస్ రెడ్డి, ఉత్తరాధ్యక్షులు గీత దమ్మన్న, వారి కార్యవర్గ బృందం దుశ్శాలువలతో, సాహిత్య వేదిక కార్యవర్గం జ్ఞాపికలతో సత్కరించడంతొ సభ ముగిసింది.












Click it and Unblock the Notifications