బే ఏరియాలో బతుకమ్మ సంబరాలు

వేదపండితుల మంత్రోచ్ఛారణలతో బతుకమ్మ, నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మహిళలు సంప్రదాయబద్దమైన చీరల్లో, బాలికలు పరికిణీల్లో బతుకమ్మ ఉత్సవాలకు హాజరై సంప్రదాయం పట్ల తమ మక్కువను చాటుకున్నారు. చాలా మంది పురుషులు కూడా సంప్రదాయ దుస్తులు ధరించారు. దాంతో పార్కు రంగులతో కాంతులీనింది.
టిసిఎ వాలంటీర్లు బాలేశ్వర్ ఇందరపు, సైదీష్ అజ్జన్, సుభాష్ రవడ, భాస్కర్ బండికల్లు నేతృత్వంలో అమెరికాలోని మార్కెట్లను చుట్టేసి బతుకమ్మలను పేర్చడానికి అవసరమైన గడ్డిపూలను, గునుగు పూలను సేకరించారు. బతుకమ్మ తయారీపై, బతుకమ్మ ఆడే పద్ధతిపై, పాటలు పాడడంపై టిసిఎ శిక్షణా కార్యక్రమాన్ని, వర్క్‌షాపును నిర్వహించింది. ఈ వర్క్‌షాపు రాజు యాసాల నేతృత్వంలో నడిచింది.
చంద్రశేఖర శర్మ గౌరీ పూజ చేయడంతో ఉత్సవాలు 14వ తేదీ ఉదయం పదకొండున్నర గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రముఖ తెలుగు కవి డాక్టర్ ప్రొద్దుటూరి ఎల్లారెడ్డిని టిసిఎ మాజీ చైర్మన్ విజయ్ చవ్వా అందరికీ పరిచయం చేశారు. బొడ్డెమ్మ, బతుకమ్మల ప్రాముఖ్యాన్ని ఎల్లారెడ్డి వివరించారు. సంబరాలకు వచ్చినవారిని చూసి తనకు అమెరికాలో ఉన్నట్లు లేదని, తెలంగాణలో ఉన్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. ఎల్లారెడ్డిని టిసిఎ అధ్యక్షుడు సైదీష్ అజ్జన్ సత్కరించారు.
మధ్యాహ్నం ఒంటి గంటన్నరకు బతుకమ్మ ఆట ప్రారంభించారు. చాలా మంది తమ పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. బతుకమ్మ గురించి చాలా మంది ఆంధ్రులు, రాయలసీమవాసులు, ఉత్తర భారతీయులు అడిగి తెలుసుకున్నారు. భిన్న మతాలకు, భిన్న భాషలకు, భిన్న జాతీయతలను బతుకమ్మ పండుగ ఒకే వేదిక మీదికి తెచ్చింది.
మహిళా పెద్దలు బతుకమ్మలకు అవార్డులు ప్రకటించడానికి న్యాయమూర్తులుగా వ్యవహరించారు. తొమ్మిది ఉత్తమ బతుకమ్మలను ఎంపిక చేసి అవార్డులు ప్రదానం చేశారు. సన్నివాలే డెనిజెన్‌కు గౌరవ పురస్కారం ప్రదానం చేశారు. ప్రసాద్ గట్టు, భాస్కర్ బండికల్లు అన్నపానాల ఏర్పాట్లు చూశారు.












Click it and Unblock the Notifications