కుల నిర్మూలనపై అమెరికాలో చర్చ

నర్రిశెట్టి రంగయ్య ఇంకా ఇలా ప్రసంగించారు - “స్వాతంత్రోద్యమం తో పాటు సామాజిక ఉద్యమం కూడా సమాంతరంగా నడిపితేనే, సమానత్వం వస్తుందన్నారు. గాంధీ గారు ఒకవైపున స్వతంత్ర పోరాటం చేస్తున్నప్పుడు, అంబేద్కర్ అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించాడు. గాంధీని కూడా ఛాలెంజ్ చేసాడు. మీరు ఎన్నోసార్లు నిరాహారదీక్ష చేసి, దేశాన్ని అంతా కలవర పరిచి, బ్రిటిషు వాళ్ళను గడగడలాడించారు, కానీ అంటరానితనం పోవడానికి, దేవాలయాలలో ప్రవేశించే హక్కు కోసం ఒక్కసారి కూడా ఎందుకు నిరాహార దీక్ష చేయలేదని ప్రశ్నిస్తే, దానికి సమాధానం లేకుండా పోయింది. గాంధీ, కాంగ్రెసు పార్టీ అంటరానితనం పోగొట్టటానికి ఏమి చేసారని ఒక గ్రంధం రాసాడు. దానికి అప్పుడు, ఇప్పుడు సమాధానం లేకుండా పోయింది. సమాజంలో పైకి సంస్కర్తలుగా చెప్పుకునే వాళ్ళు, ఎంత గొప్పగా చెప్పినా, ఆచరణకు వచ్చేసరికి, వివాహాల దగ్గరకు వచ్చేసరికి, అంటరానితనం, కుల హెచ్చు తగ్గులను పాటిస్తున్నారు. రాజ్యాంగం రాయటంలో కీలకపాత్ర వహిస్తూ, అంబేద్కరు రిజర్వేషన్ల కోసం పోరాడినప్పుడు చాలా మంది వ్యతిరేకించారు. కనీసం పది సంవత్సరాలైన రిజర్వేషన్లు వుండాలని సాధించాడు”.
ఆయన ప్రసంగం ఇంకా ఇలా సాగింది - "హిందూమతం లో అంటరాని వాళ్ళు వున్నంత కాలం, అంటరానితనం పోయే సమస్య లేదు. ఎందుకంటే అది హిందూమతం లో వున్నది కనుక, ఎన్ని సంస్కరణలు వచ్చినా, ఎన్ని గాంధీలు వచ్చినా పోదు. హిందూమతం లో అంటరానితనం ఉన్నది కనుక, దానిని వదిలేసి బౌద్ధానికి వస్తే, దేవుడు లేని మూల బౌద్ధాన్ని, మనుష్యులనందరిని సమానంగా చూసే, గౌరవించే బౌద్ధాన్ని తీసుకోమన్నారు. కొలంబియా యూనివర్సిటీ లో చదివిన రోజుల నుండి ఇండియాలో చేసిన ఉద్యమాలతో అణగారిన వర్గాలనుండి వచ్చిన ఆయన, ఒక ఉన్నత ధోరణి లోకి వెళ్ళిపోయాడు. నెహ్రూ, బోస్ ,పటేల్, యం.ఎన్.రాయ్, గాంధీ సరసన దేశాన్ని ఆలోచింప జేయగలిగాడు. అంబేద్కర్ తత్వాన్ని అమలు జేసి, సమాజాన్ని ముందుకు తీసుకు వెళ్ళవలసి అవసరం వున్నది".
నసీమ్ షేక్ మాట్లాడుతూ “అంబేద్కరు కులవ్యవస్థను నిర్మూలించటానికి ప్రయత్నించారు. సామాజిక మార్పు, రాజకీయ మార్పుకు పునాది అయ్యింది కానీ, కేవలం రాజ్యాధికారం ఒక్కటే ప్రజలలో సామాజిక మార్పు తీసుకు రాలేదు. ఒక దేశం ఇంకొక దేశాన్ని పాలించటం ఎంత తప్పని, స్వతంత్ర పోరాటం చేస్తున్నారో, అలాగే ఒక వర్గాన్ని వేరొక వర్గాన్ని తక్కువ చేసి చూడటం అంతే నేరం అని అంబేద్కరు అన్నారు. సమాజం లో అసమానతలు పరిష్కరించకుండా, రాజకీయ మార్పు కోరుకోవటం ఎంతవరకు సమంజసమని అన్నారు. అంటరానితనం తగ్గినా కూడా, కుల వివక్ష అంత కంటే ప్రభలంగా వున్నది. దీనిని నిర్మూలించటం ఎలాని మనం అలోచించాలి.” అన్నారు.
సాజీ గోపాల్ మాట్లాడుతూ “పశుగణాంక వ్యవస్థ నుండి వ్యవసాయక సమాజం మారుతున్న మానవ పరిణామ క్రమంలో వర్ణవ్యవస్థ, కులాలు పుట్టుకు వచ్చాయి. చారిత్రాత్మకంగా అమెరికా, యూరోపియన్ సమాజాలలో ‘బానిసత్వం’ పోషించిన పాత్రను, భారతదేశంలో కులవ్యవస్థ నిర్వహించింది. చతుర్వర్ణాల ప్రకారం, ఉత్పత్తి లో భాగమైన మెజార్టీ ప్రజలను, శూద్రులుగా తక్కువ కులస్తులుగా చిత్రీకరించారు. చావుకి, పుట్టుకకి మంత్రాలు చదివి, జంతుబలుల తో యజ్ఞాలు చేసి, పూజలు చేసి, ఉత్పత్తి లో ఏమాత్రం భాగం పంచుకోని బ్రాహ్మణులను ఉన్నత కులాలు గా చిత్రీకరించారు. కొన్ని వేల సంవత్సరాలు, కులాల ముసుగు లో సామాజిక దోపిడి, ఆర్ధిక దోపిడి కొనసాగాయి” అన్నారు
“మానవ సమాజానికి అవసరమైన ఉత్పత్తి చేసిన రైతుకూలీలు, చెప్పులు కుట్టటం, పరిశుభ్రం, గ్రామ రక్షణ విధులను నిర్వహించిన దళితులను అంటరానివారు చూసారు. అంటరానితనం తో మానవవత్వాన్ని మంటకలిపిన కులవ్యవస్థను, హిందూ మతోన్మాదాన్ని తిరిస్కరించాలి. కులం పునాదుల మీద ఒక జాతిని నిర్మించలేరు, ఒక నీతిని నిర్మించలేరు. దళితుల విముక్తి పుణ్యక్షేత్రాల చుట్టూ తిరగడం వల్ల రాదు, రాజ్యాధికారం వల్ల సాధ్యమౌతుందన్న అంబేద్కరు మాటలను గుర్తు చేసుకోవాలి. మానవతా విలువలు విరసిల్లే, న్యాయం జరిగే, స్వేచ్ఛా హక్కుల ఊపిరి అందే, నూతన ప్రజాస్వామిక సమాజాన్ని నిర్మించాలి. అంబేద్కర్ భావజాలాన్ని అధ్యయనం చేసి, నేటి తరానికి అన్వయించాలి.” అని ఆయన అన్నారు.
అనంత్ మల్లవరం మాట్లాడుతూ “కులసమస్య చాలా భయంకరమైన సమస్య. చివరికి అమెరికాకు కూడా యీ కులసమస్యను తీసుకొచ్చారు. అమెరికా సమాజం నుండి మనం ఒక పరిష్కారాన్ని తీసుకోవచ్చు. అమెరికా అనేది సకల జాతుల, మిశ్రమ జాతుల సమ్మేళ్ళనం. రెండు, మూడు తరాల తర్వాత ఒక కుటుంబం లో అన్నీ జాతులవారు వుంటారు. కులాంతర వివాహాలతో మనం కులవ్యవస్థను నిర్మూలించవచ్చు.”
కొండయ్య మాట్లాడుతూ “అంబేద్కర్ కనుకున్నది ఏమంటే, కులవ్యవస్థ సమాజానికి పట్టిన క్యాన్సరు రోగం లాంటిది. కాకపోతే యీ క్యాన్సర్ తలకు వచ్చింది. దీనిని అంత తొందరగా తీసివేయటం కష్టం. దళితులకు రాజ్యాధికారం ఇస్తేనే, యీ సమస్య పరిష్కారం అవుతున్నదని భావించాడు. కులవ్యవస్థ మించిన సమస్యలు ఇప్పుడు ఎన్నో వున్నాయి. ఇంకా నలుగురు ఐదుగురు అంబేద్కర్ లు రావలసిన అవసరం వున్నది” అన్నారు.
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాన్ టెక్స్) పూర్వ అధ్యక్షులు కన్నెగంటి చంద్ర మాట్లాడుతూ “ఆంధ్రదేశానికి మనం దూరం వున్నాము కనుక, నిజానికి అక్కడ ఏమి జరుగుతున్నదో మనకి పెద్దగా తెలియదు. ఇటీవల పరిస్థితి కొంత మారుతున్నది, పూర్తిగా మారి పోవాలా అనేది ఒక ప్రశ్న. ఎందుకంటె యీ కులాలు పోయినా, కొత్త కులాలు పుట్టుకు వస్తాయి. ఇప్పుడు కులాల ప్రాదాన్యత కూడా తగ్గుతుంది. ఆధిపత్యం వున్నంతవరకు ఒక వర్గం ఇంకొక వర్గం పైన పెత్తనం చెలాయిస్తోంది” అని అన్నారు.












Click it and Unblock the Notifications