వేటూరి - స్వర రాగ గంగా ప్రవాహం

 Kala Vahini - Veturi Swara Raaga Ganga Pravaaham
డల్లాస్: డల్లాస్‌లోని సంగీత ప్రియులకు 16 డిసెంబరు, 2012 ఆదివారము సాయంత్రం ఓ పర్వదినం. కళావాహిని సంస్థ, వేటూరి కలం నుండి జాలువారిన కొన్ని ఆణిముత్యాలను గుదిగుచ్చి అందించి, డాలస్‌లోని తెలుగు సంగీత ప్రియులను ఆనంద డోలికలలో ముంచెత్తినది. అటు విశ్వనాథ్ సినిమాలనుండి ఇటు చక్రవర్తి, మణిశర్మల వరకూ ఎంతో వైవిధ్యం గల పాటలతో తెలుగువారిని దాదాపు ముప్ఫై ఏళ్ళు ఉర్రూతలూగించిన కవివరేణ్యుడు వేటూరి కలంనుండి జాలువారిన సినీగీతాలతో కూడిన ఈ కార్యక్రమం ప్రేక్షకులను ఆద్యంతము అలరించినది.

యువ గాయకుడు సూపర్ సింగర్ శ్రీకృష్ణ గొంతులో మొదలైన ఈ స్వర రాగ గంగా ప్రవాహం, ప్రముఖ గాయని అనిత కృష్ణ, స్థానిక గాయనీ గాయకుల గాత్రసందోహములో జాలువారి చిన్నారి బాలల నృత్యాలలో పరవళ్లు తొక్కినది.పాట చినుకులా రాలి వరదలై పొంగింది. ఆణిముత్యాలు దొర్లాయి. బంతీ చామంతులు వెల్లి విరిసాయి. కుకూ కుకూ అని కోయిలమ్మ కూసింది. ఆ మధుమాసములో ఆ దరహాసములో, ఆ నవమి నాటి వెన్నెలలో మల్లెలు పూసి రేయి హాయిగా మారినది. రామా చిలకమ్మలు సీతాకోకచిలకలు ఓరుగల్లుకే పిల్ల అని ఘల్లు ఘల్లు మంటూ గంతులేసాయి.

ఆహూతుల తలపుల తలుపులు తెరుచుకున్నాయి. ఓ ప్రేయసి మేలుకుని, తొలిసారి మిమ్ములని చూసింది మొదలు కలిగాయి మదిలోన ఎన్నెన్నో వగలు, మరి నా మనసులోని మర్మాన్ని తెలుసుకోవేరా రా రా సామి రారా అని పిలిచింది. వలపుల హరిచందనాలను ఇచ్చింది. రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళిలో ఓలలాడింది. మౌనమేలనోయి ఈ మరపురాని రేయి అని వగలు పోయింది. అబ్బనీ తీయని దెబ్బ అని కమ్మగా కూజితరవములు వెలువరించింది.

మాఘమాసము ఎప్పుడొస్తుందో నా ప్రియుని హృత్సారసాబ్జము ఎప్పుడు విరుస్తుందో అని సామజవర గమనుని వేడుకొన్నది. వెన్నెల పైటేసుకొని వచ్చిన కిన్నెరసానిని ఓ ప్రియుడు చూసాడు. శ్రీలచ్చిలా సింగారించుకున్న మాలచ్చి బంగారము కదా అని మురిసిపోయాడు. సిరిమల్లె నీవే విరజల్లు కావే అని వలపులు వలకపోసాడు. రవివర్మకే అందని అందాలను మనసులోనే ఆరాధించాడు.

నాలుగు గంటలు నాలుగు నిమిషాలుగా మారిపోయాయి. అలా ఆ కలల అలలలో, ఆ కమనీయ స్మృతులలో తేలియాడని శ్రోతలు బహుశ ఉండరేమో! ఎన్నో మధురమైన అనుభూతులను జ్ఞాపకాల అరలలో నుంచి వెలికితీసి భద్రముగా మూటగట్టుకుని వెంట తీసుకుని వెళ్లారు. కార్యక్రమ నిర్వాహకులు రమణ జువ్వాడి , అనంత్ మల్లవరపు, విజయ చంద్రహాస్ మద్దుకూరి అధ్వర్యంలో కార్యక్రమాన్ని రక్తి కట్టించిన ప్రముఖ గాయకుడు శ్రీకృష్ణని, గాయని అనిత కృష్ణని, ఈ ప్రముఖ గాయకులకు స్థాయిలో ఏ మాత్రం తీసిపోకుండా శ్రోతలను అలరించిన స్థానిక గాయనీ గాయకులను, పోషకదాతలను కళావాహిని సంస్థ ఉచిత రీతిన జ్ఞాపికలతో గౌరవించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+