అమెరికాలో తెలంగాణపై సదస్సు
ఆటా మహాసభల సందర్భంగా తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (టిడిఎఫ్) ఈ నెల 7వ తేదీన తెలంగాణపై అమెరికాలోని అట్లాంటాలో ఓ రాజకీయ సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో టిడిఎఫ్ చైర్మన్ డాక్టర్ గోపాల్ రెడ్డి గాదె సంధానకర్తగా వ్యవహరించారు. తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, మేధావులు, కళాకారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. దాదాపు వేయి మంది ఈ సదస్సుకు హాజరయ్యారు.

ఫోరం కమిటీ సభ్యులు, బోర్డు ట్రస్టీలు టి. రామచంద్రా రెడ్డి, విప్లవ్ రెడ్డి, సుధాకర్ పెర్కారి, విషు కాల్వల, లక్ష్మణ్ అనుగు, రమేష్ చిల్ల, జగదీష్ బొందుగుల, వినయ్ బాసాని, చంద్రమోహన్ నెల్లుట్ల, హరి కాసుల ఈ సదస్సులో పాల్గొన్నారు. పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ, న్యూజెర్సీ డిప్యూటీ స్పీకర్ ఉపేంద్ర చివుకుల, తెలంగాణ జాగృతి నేత కల్వకుంట్ల కవిత, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, పివోడబ్ల్యు సంధ్య, బిజెపి శానససభ్యుడు యెన్నం శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణరావు, భూపాల్ రెడ్డి, నర్సారెడ్డి, తెలుగుదేశం ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కెఎస్ రత్నం, తెలంగాణ రాష్ట్ర సమితి నేత కర్నె ప్రభాకర్, యువ తెలంగాణ ప్రతినిధి జిట్టా బాలకృష్ణా రెడ్డి, తెరాస నేత గణేష్ బీగల, బిజెపి నేత రామచంద్ర రావు, ఎమ్మెల్సీ దిలీప్, తదితరులు కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వారు తమ ఆకాంక్షను వెల్లడించారు.
జయశంకర్ మృతికి సంతాపసూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించిన తర్వాత సదస్సు ప్రారంభమైంది. స్ఫూర్తి చంద్ర, సాంత్వనచంద్ర తెలంగాణ గేయాలు ఆలపించారు. టిడిఎఫ్ అధ్యక్షుడు మురళీ చింతలపాణి సందేశం ఇచ్చారు. తెలంగాణకు జరుగుతన్న అన్యాయాన్ని టిడిఎఫ్ ఉపాధ్యక్షుడు శ్రీరామ్ వెదిరె వివరించారు. చివరలో ప్రశ్నలు, సమాధానాల సెషన్ జరిగింది. ముఖ్య అతిథులు సభికులు వేసిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
స్వార్థ ప్రయోజనాలను, వ్యక్తిగత ఎజెండాను పక్కన పెట్టి అని రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి చేయాలని సదస్సు తీర్మానించింది. రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి 2014 ఎన్నికల్లో ఉమ్మడి ప్రణాళికతో తెలంగాణలో పోటీ చేయాలని సదస్సు కోరింది. తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకోవద్దని సదస్సు యువతను కోరింది. టిడిఎఫ్ ప్రధాన కార్యదర్శి మురళీ గౌడ్ రామగోని వందన సమర్పణతో సదస్సు ముగిసింది.












Click it and Unblock the Notifications