అమెరికాలో రోడ్డు ప్రమాదం: ఏపీ వైద్యురాలు మృతి
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ తెలుగు యువతి ప్రాణాలు కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వెటర్నరీ డాక్టర్ జెట్టి హారిక(25) ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఆమె మృతి విషయం తెలిసిన కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.
గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్‌కు చెందిన జెట్టి హారిక పశువైద్యురాలు. ఎంఎస్ చేయడానికి ఆమె గత ఏడాది ఆగస్టులో అమెరికా వెళ్లారు. ఆదివారం ఉదయం ఓక్లహోమా రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తరలించేందుకు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్ఆర్ఐలతో సంప్రదిస్తున్నారు.

మరోవైపు, ఏపీ మంత్రి లోకేష్ స్పందించాలని, తమ కూతురు మృతదేహాన్ని స్వదేశానికి త్వరగా తీసుకొచ్చేలా చూడాలని హారిక కుటుంబసభ్యులు విన్నవిస్తున్నారు. కాగా, హారిక తండ్రి ఏపీ దేవాదాయ శాఖ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. హారిక మరణంతో ఆమె కుటుంబంతోపాటు స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇటీవల కాలంలో విదేశాల్లో ఉంటున్న భారతీయులు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందినవారు వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకర అంశంగా మారింది. కొందరు ప్రమాదాల్లో చనిపోతే.. మరికొందరు దుండగుల దాడులు, కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఉన్నత విద్య, ఉపాధి కోసం వెళ్లిన తమవారు ఇలా ప్రాణాలు కోల్పోతుండటంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది.












Click it and Unblock the Notifications