లండన్‌లో రోడ్డు ప్రమాదం: కోమాలోకి హైదరాబాద్ యువతి, తల్లి ఆవేదన
ఇంగ్లాండ్ రాజధాని నగరం లండన్‌లో హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువతి రోడ్డు ప్రమాదానికి గురైంది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలపాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇంకా 24 గంటలు గడిస్తేగానీ ఏమీ చెప్పలేమని వైద్యులు చెప్పారు. సమాచారం తెలిసిన యువతి హిమబిందు కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.
ఉద్యోగ నిమిత్తం ఐదు నెలల క్రితం లండన్‌లోని ప్రెస్టన్‌కి వెళ్లింది హైదరాబాద్ చైతన్య పురికి చెందిన యువతి హిమబిందు. లండన్‌లోని బ్రొక్ హేవన్ అనే హాస్పిటల్‌లో కేర్ టేకర్‌గా ఉద్యోగం చేస్తోంది. గత నెల అక్టోబర్ 24న రోడ్డు దాటుతున్న క్రమంలో అత్యంత వేగంగా దూసుకు వచ్చిన ట్రక్ ఆమెను ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన హిమబిందు కోమాలోకి వెళ్లింది.

సమాచారం అందుకున్న లండన్ పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని హిమబిందును ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారకుడైన ట్రక్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ డ్రగ్ మత్తులో రాష్ డ్రైవింగ్ చేయడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధరించారు.
ఈ విషయం గురించి హైదరాబాద్ చైతన్యపురిలో ఉంటున్న యువతి తల్లికి లండన్‌లో ఉండే బంధువులు తెలియజేశారు. గత 16 రోజులుగా ఆందోళన చెందుతున్న తల్లి వెంకట రమణమ్మ తమ ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ప్రభుత్వం తమ కూతురు వైద్యానికి ఆర్థిక సాయం అందించాలని కోరారు.
అదేవిధంగా లండన్ వెళ్ళేందుకు సాయం అందించాలని తల్లి వెంకట రమణమ్మ మీడియా ద్వారా ప్రభుత్వంను అభ్యర్దించారు. హిమబిందుకు 8ఏళ్ల కూతురు కూడా ఉందని, పాప తమ వద్దే ఉంటుందని వెంకట రమణమ్మ తెలిపారు.












Click it and Unblock the Notifications