హైదరాబాద్‌లో ఆటా సేవలు
హైదరాబాద్: అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా) వేడుకలు భారతదేశంలో నిర్వహించడం ఎంతో గర్వంగా ఉందని, ఫిలడెల్ఫియా, పిఏలో జరగనున్న 13వ ఆటా మహాసభలకు ఇది ప్రారంభ కార్యక్రమమని ఆటా అధ్యక్షుడు కరుణాకర్ మాధవరం తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని ఫతేహ్ మైదాన్ క్లబ్‌లో మీడియా సమావేశం అనంతరం ఆయన ఇందుకు సంబంధించిన కార్యక్రమాలతో కూడిన పత్రిక ప్రకటనను విడుదల చేశారు.
ఆటా రెండు సంవత్సరాలకు ఒక సారి ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించే తెలుగు సాంస్కృతి ప్రదర్శనల్లో పాల్గొనడానికి ఉత్తర అమెరికాకు తెలుగు పండితులు, కళాకారులు, నాయకులు వస్తున్నారని, భారతదేశానికి, అమెరికాకు మధ్య సాంస్కృతిక వారధిలా తనవంతు బాధ్యతలు నిర్వహిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఆటా తదుపరి సమావేశం 2014 జులై 3 నుంచి 5వరకు ఫిలడెల్పియా, పిఏలో జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాలకు దాతల నుంచి విరాళాలు సేకరిస్తామని తెలిపారు. 15వేల మంది ఆటా సభ్యులు, వందలాది మంది ప్రముఖులు మనదేశం నుంచి పాల్గొంటారని ఆయన చెప్పారు.

భారతదేశంలో సేవా కార్యక్రమాలు, వేడుకలను పర్యవేక్షించేందుకు కరుణాకర్ మాధవరం ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల బృందంగా హైదరాబాద్‌కు వచ్చినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. డిసెంబర్‌లో హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో పలు సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. శిల్పా కళావేదిక వద్ద నిర్వహించనున్న కార్యక్రమానికి రాజకీయ, సినీ ప్రముఖులు హాజరుకానున్నట్లు కరుణాకర్ తెలిపారు. ఈ సందర్భంగా డిసెంబర్ 1న నెక్లెస్ రోడ్‌లో 5కి.మీ పరుగు, రొమ్ము క్యాన్సర్, మహిళల గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
పైరసీ వ్యతిరేక కార్యక్రమాలు, గృహ హింస, అభయ, నిర్భయ సంఘటనలకు వ్యతిరేకంగా నిలబడడానికి సహాయ కార్యక్రమాల నిర్వహించనునన్నట్లు, ఇందు కోసం ఆటా సందేశం ఉన్న టీ షర్టులను ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 2 నుంచి 6వరకు రక్తదాన, ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 7న శిల్పారామంలో విదేశీ విద్యపై అవగాహన సదస్సును, మహిళల ఫోరం సెమినార్, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, వరకట్నం వేధింపులు, ఇతర సామాజిక సమస్యలపై అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమాలకు ప్రతిమ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కిమ్స్(కృష్ణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్), ఫినిక్స్ బిల్డర్స్, గోల్డెన్ గేటు, ఓఎస్ఐ కన్సల్టింగ్, కృష్టి రియాల్టర్స్ ఇతర దాతల సహాయంతో సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆటా అధ్యక్షుడు కరుణాకర్ మాధవరం తెలిపారు. మీడియా సమావేశంలో కరుణాకర్ మాధవరంతోపాటు ఆటా ముఖ్య సభ్యులు రామచంద్రారెడ్డి, పద్మజా రెడ్డి, సురేందర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సురేష్ కాలేరు, శ్రీనివాస్ గౌడ్‌లు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications