యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో జిందాల్!
వాషింగ్టన్: అమెరికా రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్న భారతీయ అమెరికన్ బాబీ జిందాల్ అగ్రరాజ్య అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. రిపబ్లికన్ పార్టీ నాయకుడిగా కొనసాగుతున్న ఆయన ప్రస్తుతం లూసియానా గవర్నర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
కాగా జిందాల్ రాష్ట్రానికి చెందిన రిపబ్లికన్ పార్టీ సెనెటర్ డేవిడ్ విట్టర్ మాట్లాడుతూ.. జిందాల్ 2016 ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం పోటీ పడే అవకాశం ఉందని అన్నారు. అందుకు అతను అర్హుడైన వ్యక్తేనని అమెరికన్ టీవి ఛానల్ సి-స్పాన్స్ న్యూస్ మేకర్ ఇంటర్వ్యూలో విట్టర్ తెలిపారు. ప్రజాదరణ గల బాబీ జిందాల్ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగితే అందరూ సంతోషిస్తారని ఆయన అన్నారు.

బాబీ జిందాల్ అంటే ఇష్టమని, అతని నాయకత్వంపై గౌరవం ఉందని తెలిపారు. రాజకీయాలకు కావాల్సిన అన్ని విలువలు జిందాల్‌కు ఉన్నాయని చెప్పారు. కానీ తనకు దాని గురించి ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలియదని విట్టర్ తెలిపారు. అయితే వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు బరిలో ఉంటారంటే మాత్రం.. జిందాల్‌పై దృష్టి పెట్టాల్సి ఉంటుందని చెప్పారు. ప్రతీ ఒక్కరూ కూడా జిందాల్ అధ్యక్ష బరిలో నిలుస్తారనే భావిస్తున్నారని ఆయన తెలిపారు.
రెండోసారి లూసియానా గవర్నర్ బాధ్యతలు స్వీకరించిన బాబీ జిందాల్ పదవీ కాలం 2015తో ముగియనుంది. అయితే అతను మూడోసారి గవర్నర్ బరిలో నిలిచే అవకాశం లేదని విట్టర్ అన్నారు. దీన్ని బట్టి చూస్తే విట్టర్ గవర్నర్ బరిలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా జనవరిలో ఈ విషయాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని డేవిట్ విట్టర్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications