ప్రభుత్వ విభాగంపై విమర్శ: యూఏఈలో భారతీయుడికి భారీ జరిమానా
అబూదాబి: యూఏఈ(యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్) రవాణా విభాగాన్ని విమర్శిస్తూ ఇ-మెయిల్ పెట్టినందుకు ఓ భారతీయ కార్మికుడికి సుమారు రూ.87లక్షల భారీ జరిమానా విధించింది ఆ దేశం. కొద్ది నెలల క్రితం డ్రైవింగ్ లైసెన్స్ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయిన ఆ కార్మికుడు.. విమర్శలతో కూడిన మెయిల్‌ను రవాణా విభాగానికి ఇ మెయిల్ చేశాడు.
ఉద్దేశపూర్వకంగానే పేదలను అర్హత పరీక్షలో ఫెయిల్ చేసి, వారు మళ్లీ మళ్లీ పరీక్షలకు హాజరయ్యేలా రవాణా విభాగం ఇబ్బందులకు గురిచేస్తోందని ఆ 25ఏళ్ల భారతీయుడు విమర్శించాడు. అంతేగాక, అలా పేదల నుంచి డబ్బు దోచుకుంటోందని ఆరోపించాడు.

ఈ క్రమంలో తమను అవమానించేలా, చులకన చేసేలా సదరు మెయిల్ ఉందని పేర్కొంటూ.. రవాణా విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు నేరం అంగీకరించకపోయినా.. దుబాయ్ కోర్టు తీర్పుతో అతడ్ని 3నెలలపాటు జైల్లో పెట్టారు. అంతేగాక, అతనికి కోర్టు రూ. 87లక్షల జరిమానా కూడా విధించింది. ఇదీగాక, శిక్ష పూర్తయిన తర్వాత అతడ్ని దేశం నుంచి పంపించేయాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications